ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టి.. చెరువులో పడేసి  | Unknown Women Body Found In Borabanda | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టి.. చెరువులో పడేసి 

Published Sun, Jun 21 2020 9:54 AM | Last Updated on Sun, Jun 21 2020 9:58 AM

Unknown Women Body Found In Borabanda - Sakshi

మృతి చెందిన మహిళ కుడిచేతిపై ఉన్న టాటూ

సాక్షి, సనత్‌నగర్‌ : గుర్తు తెలియని వ్యక్తులు మహిళను హత్య చేసి ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టి చెరువులో పడేశారు. అయితే హత్యకు గురైన మహిళ మృతదేహం గుర్తు పట్టలేని విధంగా ఉండడంతో పోలీసులు ఆమె గురించి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన వివరాలు ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి వివరాల ప్రకారం.. బోరబండ సమీపంలోని సున్నం చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం తేలియాడుతుందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహం మహిళదిగా గుర్తించారు.

అప్పటికే మృతదేహం ఉబ్బిపోయి ఉండడంతో పాటు ముఖం గుర్తుపట్టలేని విధంగా ఉంది. దీనిని బట్టి చెరువులో పడేసి చాలా రోజులు అయి ఉండవచ్చని భావిస్తున్నారు. కాళ్లు, ముఖం మినహా మిగతా శరీర భాగాలకు ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టి ఉంది. అలాగే కాళ్లు చేతులు సన్నని వస్త్రంతో కట్టేసి ఉన్నాయి. తలకు బలమైన గాయమైనట్లు గుర్తించారు. దీనిని బట్టి మహిళను హత్య చేసి చెరువులో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ వయస్సు 30–40 ఏళ్ల మధ్యలో ఉంటుందని, ఆమె కుడి చేతిపై ‘ఎస్‌’ అక్షరంతో టాటూ ముద్రించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె వివరాలు తెలిస్తేనే హత్యకు ఒడిగట్టింది ఎవరు? హత్యకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేయనున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ చెప్పారు. మృతురాలి చేతిపై ఉన్న టాటూ ఆధారంగా ఆమె సంబంధీకులు మృతదేహాన్ని గుర్తించగలరని భావిస్తున్నట్లు తెలిపారు. మహిళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే సనత్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించాల్సిందిగా కోరారు. ఈ మేరకు హత్య కేసుగా భావించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement