
మీడియాతో గోడు వెళ్లబోసుకుంటున్న బాధితురాలు
లక్నో: తన కుటుబాన్ని హోటల్‌లో నుంచి బయటకు రానివ్వడంలేదని, తాగడానికి నీళ్లు ఇవ్వడం లేదని ఉనావో అత్యాచార బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగర్, ఆయన సోదరులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముందు ఆమె ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు పోలీసు కస్టడీలో ఉన్న బాధితురాలి తండ్రి సోమవారం మృతి చెందారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు బాధితురాలి కుటుంబానికి ఉనావోలోని ఓ హోటల్‌లో వసతి ఏర్పాటు చేశారు.
బాధితురాలు బుధవారం ఏఎన్‌ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. పోలీసులు తమను ఖైదీల్లా చూస్తున్నారని ఆరోపించారు. ‘ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టుకోనివ్వడం లేదు. గది నుంచి బయటకు రానివ్వట్లేదు. కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వడం లేద’ని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆథిత్యనాథ్ తమకు న్యాయం చేయాలని, ఈ కేసును సీబీఐకి అప్పజెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరగకపోతే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని మరోసారి ప్రభుత్వాన్నిహెచ్చరించారు.
ఈ కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సోదరుడు అతుల్ సెంగార్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలో మరణించిన వెంటనే సీఎం యోగి ఆదిత్యానాథ్ ఈ వ్యవహారంపై ఉన్నతస్ధాయి విచారణకు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment