సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో ఓ దివ్యాంగురాలిపై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడి చేశారనే సంఘటన కలకలం రేపింది. జిల్లాలోని నెల్లిమర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని సారిపల్లి రోడ్డులో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో సంఘటనపై విచారణ చేపట్టిన పోలీసులుకు దర్యాప్తులో నివ్వెరపోయే విషయాలు తెలిశాయి. జిల్లా ఎస్పీ పాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి అసలు గ్యాంగ్ రేప్ జరుగలేదని తేలింది. అత్యాచారం జరిగిందని యువతి చెబుతున్న వివరాలకు, పోలీసులు విచారణలో తెలిసిన విషయాలకు పొంతన కుదరలేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేసి అత్యాచార సంఘటన అబద్ధమని తేల్చేశారు. అంతేకాక ఘటన వెనుక ఉన్న అసలు విషయాన్ని తెలుసుకుని పోలీసులు ఆశ్చర్చపోయారు. సదరు యువతి ఆదివారం రాత్రి ఇంటికి ఆలస్యంగా వెళ్లింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యలు తిడతారని తనపై గ్యాంగ్ రేప్ జరిగినట్టు నాటకమాడింది. ఈ విషయాన్ని యువతి ఒప్పుకున్నట్టు ఎస్పీ తెలిపారు.
ఆదివారం ఏం జరిగింది..?
ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఓ యువతి ఆటో ఎక్కింది. అదే వాహనంలో మరో ఇద్దరు వ్యక్తులున్నారు. పూల్‌బాగ్‌కాలనీ వద్ద ఆమె దిగాల్సి ఉన్నా డ్రైవర్ ఆటోను ఆపలేదు. ఎందుకు ఆపలేదని ఆడిగిన ఆమెను బలవంతంగా నోరు నొక్కి సారిపల్లి రోడ్డులో నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం ఆమెపై ఆటో డ్రైవర్‌తో పాటు, మరో ఇద్దరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతలోనే సమీపంలో వినికిడి రావడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత సదరు యువతి స్థానికలు సహాయంతో ఇంటికి చేరింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లిన యువతిని తల్లిదండ్రులు ప్రశ్నించగా... తనపై సాముహిక అత్యాచారం జరిగినట్టు తెలిపింది. దీంతో వారు పూసపాటిరేగ ఆస్పత్రికి తరలించడంతో పోలీసులకు సమాచారం అందింది.
రంగంలోకి జిల్లా ఎస్పీ
దీంతో విషయం తెలుసుకున్న ఎస్పీ పాలరాజు ఘటన జరిగిన స్థలానికి స్వయంగా వెళ్లి పరిశీలించారు. విజయనగరం కోట కూడలి నుంచి అత్యాచారం జరిగిందని చెప్పిన ప్రదేశం వరకు రోడ్లకు ఇరువైపులా 15 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సమీపంలో ఉన్న గ్యాస్ గోదాము నిర్వాహకుల నుంచి సైతం వివరాలు సేకరించారు. పలు విషయాలపై ఆరా తీసిన పోలీసులు, మరింత సమాచారం కోసం యువతిని ప్రశ్నించారు. అయితే ఆమె చెప్పిన విషయాలు నమ్మశక్యం కాకపోవడంతో మరింత లోతుగా విచారణ చేసిన పోలీసులు నిజాలు నిగ్గు తేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment