
సాక్షి, విజయవాడ: ట్రాఫిక్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన నేరంలో బీజేపీ నేత అడ్డంగా బుక్కయ్యారు. నగరానికి చెందిన వ్యాపారవేత్త, బీజేపీ నేత లాకా వెంగళ్ రావు యాదవ్ శనివారం రాత్రి ఎంజీరోడ్‌లో వీరంగం సృష్టించాడు. ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులకు పాస్‌పోర్ట్ కార్యాలయం పక్కన పార్క్ చేసిన ఉన్న వెంగళ్ రావు సఫారీ వాహనం కనిపించింది. దానిని తొలగించాల్సిందిగా కోరగా ఆయన పట్టించుకోలేదు. దీంతో టోయింగ్ వాహనాన్ని తీసుకొచ్చి వాహనాన్ని తొలగించేందుకు యత్నించారు. అది గమనించిన వెంగళ్ రావు ఆగ్రహంతో ఊగిపోయారు.
ట్రాఫిక్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ట్రాఫిక్ సీఐ సుబ్బరాజుతో దురుసుగా ప్రవర్తించటమే కాకుండా.. అడ్డుకోబోయిన కానిస్టేబుల్‌పై కారు ఎక్కించేందుకు యత్నించారు. ఆపై అక్కడి నుంచి కారుతో వేగంగా వెళ్లిపోయాడు. ఈ ఘటనపై ట్రాఫిక్ సీఐ.. సూర్యారావు పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రమాదకరంగా వాహనం నడపటంతో పాటు, అధికారుల విధులకు ఆటంకం కలిగించినట్లు వెంగళరావు యాదవ్‌పై కేసు నమోదు చేసి ఆదివారం అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే 2009 ఎన్నికల్లో ఇతను విజయవాడ ఎంపీగా, బీజేపీ తరుపున పోటీ చేసాడు కూడా.
Comments
Please login to add a commentAdd a comment