హెచ్‌ఎం సుబ్రహ్మణ్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
తూర్పుగోదావరి, రాజోలు: విద్యార్థినుల ఆలనా...పాలనా చూసుకోవాల్సిన ప్రధాన ఉపాధ్యాయుడే వక్రబుద్ధితో విద్యార్థినులు చెప్పుకోలేని విధంగా లైంగిక వేధింపులకు పాల్పడడంతో గ్రామస్తులు ఆగ్రహించి ఆ ఉపాధ్యాయుడిపై తిరగబడ్డారు. వివరాల్లోకి వెళితే.. రాజోలు మండలం బి.సావరం యూపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.సుబ్రహ్మణ్యం విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తెలిసిన తల్లిదండ్రులు కోపోద్రిక్తులై శుక్రవారం పాఠశాలను చుట్టుముట్టారు. చీటికిమాటికీ కొట్టడంతోపాటు బెదిరిస్తున్నారని ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినులను సచివాలయంలోని మహిళాసంరక్షణ కార్యదర్శి (మహిళా పోలీసు)కు ఫిర్యాదు చేశారు. ప్రధానోపాధ్యాయుడు చేస్తున్న వేధింపులపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని పట్టుపట్టారు. పాఠశాల వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధానోపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం తీరుపై మండల విద్యాశాఖాధికారి గోపాలకృష్ణ విచారణ నిర్వహించి నివేదికను డీఈవోకు అందజేశారు. ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై ఎస్.శంకర్ తెలిపారు.
ప్రధానోపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హెచ్‌ఎం సస్పెన్షన్
బి.సావరం యూపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్రహ్మణ్యాన్ని జిల్లా విద్యాశాఖాధికారి అబ్రహం సస్పెండ్ చేశారు. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు రావడంతో హెచ్‌ఎంపై ఈమేరకు చర్యలు తీసుకున్నారు. ఉపాధ్యాయులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తే కఠిన చర్యలు తప్పవని డీఈవో హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment