సెల్లార్‌లో విద్యార్థులను బంధించిన దృశ్యం
గాజువాక: టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు చెందిన వైజాగ్ డిఫెన్స్ అకాడమీ గాజువాక క్యాంపస్‌లో దుర్మార్గం చోటు చేసుకుంది. అడ్మిషన్ సమయంలో తమకు ఇస్తామన్న సౌకర్యాలను ఎందుకివ్వడం లేదని ప్రశ్నించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం బంధించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు గేట్లను తెరిపించి విద్యార్థులను చెర నుంచి విడిపించారు. శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఈ సందర్భంగా విద్యార్థులు పలు విషయాలను వివరించారు. వారి కథనం ప్రకారం.. వైజాగ్ డిఫెన్స్ అకాడమీ యాజమాన్యం ఇంటర్‌తోపాటు ఆర్మీ, నేవీలో చేరడానికి అవసరమైన శిక్షణ, ఉద్యోగం గ్యారంటీ, విశాలమైన ఆట స్థలం, హార్స్ రైడింగ్, స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలతో పాటు హాస్టల్‌లో మంచి భోజనం కల్పిస్తామని అడ్మిషన్ల సమయంలో చెప్పింది. దీంతో వైఎస్సార్, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు 400 మంది విద్యార్థులు చేరారు. అయితే, అడ్మిషన్ల సమయంలో చెప్పిన సౌకర్యాలేవీ కల్పించకపోగా.. పురుగులతో కూడిన భోజనం పెడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. మొదట్లో రూ. 1.40 లక్షల ఫీజు చెప్పిన యాజమాన్యం తమ నుంచి రూ. 1.90 లక్షలను వసూలు చేసిందని పేర్కొన్నారు.
ఆటల కోసం దూరంగా ఉన్న జీవీఎంసీ గ్రౌండ్‌కు తీసుకెళ్తున్నారని, హార్స్ రైడింగ్ ఊసెత్తడం లేదని, స్విమ్మింగ్ పూల్ లేదని తెలిపారు. ఎన్నిసార్లు కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని చెప్పారు. దీంతో వైజాగ్ డిఫెన్స్ అకాడమీ మెయిన్ బ్రాంచ్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి బయలుదేరుతుంటే ఇలా సెల్లార్లలో పెట్టి అడ్డుకున్నారని వివరించారు. విద్యార్థుల ఆవేదనను విన్న గాజువాక సీఐ సూరినాయుడు కళాశాలలో దర్యాప్తు చేస్తున్నారు. గాజువాక బ్రాంచ్ అడ్మినిస్ట్రేటివ్ అఫీసర్ భాస్కర్‌రావుతో విద్యార్థుల సమక్షంలో సీఐ మాట్లాడారు. 5 రోజుల్లో సదుపాయాలన్నీ కల్పిస్తామని భాస్కర్‌రావు హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment