భోపాల్: దొంగతనం అంటే మాటలా..? ముందుగా దానికి ఓ పక్కా ప్లాన్ ఉండాలి. దానికి అనుగుణంగా స్కెచ్ గీసుకోవాలి. అలా చేస్తే గానీ అనుకున్న పని అవ్వదు. సరిగ్గా ఓ దొంగ ఇలానే చేశారు. పక్కా ప్లాన్‌తో ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే అక్కడ దొంగకి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రాంతంలో ఓ దొంగ రాత్రంతా ఎంతో కష్టపడి ప్రభుత్వ సంస్థలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న పర్వేష్‌సోని ఇంట్లోకి అతికష్టం మీద కిటికీలు తొలగించి ప్రవేశించాడు. తీరా లోపలికి వెళ్లి చూస్తే షాక్‌కు గురయ్యాడు. ఇళ్లు మొత్తం వెతికినా దోచుకెళ్లడానికి కావాల్సిన విలువైన వస్తువులు ఏమీ లేకపోవడంతో నిరుత్సాహపడ్డాడు. ఇంతవరకు తాను పడిన కష్టానికి ఫలితం దక్కనందుకు కోపంతో ఇంటి యజమానికి ఒక లేఖ రాసి టేబుల్ మీద పెట్టి వెళ్లిపోయాడు.
ఆ లేఖలో ‘నువ్వు చాలా పిసినారివిరా.. కనీసం కిటికీ తొలగించడానికి పడిన శ్రమకు కూడా తగిన ఫలితం దక్కలేదు. ఈ రాత్రంతా వృథా అయ్యింది’ అని హిందీలో రాసి వెళ్లిపోయాడు. గురువారం ఉదయం పర్వేష్ ఇంట్లో పనికి వచ్చిన మహిళ ఇంటిలోని వస్తువులన్నీ కిందపడి ఉండటంతో షాక్ అయ్యింది. టేబుల్ మీద ఉన్న లేఖ చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. చేతిరాత పరిశీలన నిపుణులకు పంపారు. పర్వేశ్ ఇల్లు జాయింట్ కలెక్టర్, న్యాయమూర్తి ఇంటికి దగ్గరలో ఉండడంతో కేసుని సీరియస్‌గా తీసుకుని, సీసీ టీవీ పుటేజ్‌ని కూడా పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment