‘డి’ డాన్‌ ఎవరు? | Who is the next don after Dawood? | Sakshi
Sakshi News home page

‘డి’ డాన్‌ ఎవరు?

Published Thu, Dec 14 2017 2:19 AM | Last Updated on Mon, Oct 8 2018 4:18 PM

Who is the next don after Dawood? - Sakshi

(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌) దాదాపు 20 దేశాల్లో మాఫియా సామ్రాజ్యాన్ని ఏలుతున్న డాన్‌ దావూద్‌ ఇబ్రహీం వారసుడు ఎవరు? దావూద్‌ వ్యవహారాలు నచ్చని అతడి కుమారుడు మొయిన్‌ నవాజ్‌ ఇప్పటికే ఆ ముఠాకు దూరంగా ఉంటున్నాడు.. ఇప్పుడు దావూద్‌ ప్రధాన అనుచరుడు, ‘డి కంపెనీ’అనధికార సీఈవోగా పేరుపడ్డ చోటా షకీల్‌ కూడా ముఠా నుంచి బయటికి వెళ్లిపోయాడు. మరిప్పుడు ‘డి కంపెనీ’కి నాయకుడు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 27న 62 ఏళ్లు నిండుతున్న దావూద్‌ అనారోగ్యం కారణంగా వారసుడిపై దిగాలుగా ఉన్నాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. 

నమ్మినబంటు దూరం 
ప్రస్తుతం పాకిస్తాన్‌లోని కరాచీలో ఉంటూ మాఫియా సామ్రాజ్యాన్ని నియంత్రిస్తున్న దావూద్‌ ఇబ్రహీంకు 30 ఏళ్లుగా నమ్మినబంటుగా ఉన్నాడు షకీల్‌. దావూద్‌ గ్యాంగ్‌ రోజూవారీ కార్యకలాపాల బాధ్యత చూసేది అతనే. దావూద్‌ తరఫున మీడియాతో మాట్లాడడం (కరాచీ నుంచి ఫోన్‌లో) చేసేదీ తనే. దావూద్‌ తర్వాత ‘డి కంపెనీ’కి తనే నేతృత్వం వహించవచ్చన్న అభిప్రాయాలూ ఉన్నాయి. ఎందుకంటే దావూద్‌ కుమారుడు మోయిన్‌ నవాజ్‌కు మాఫియా కార్యకలాపాలపై ఇష్టం లేదు. ముఠా నాయకత్వం తీసుకోవడానికి అతను సిద్ధంగా లేడని, దాంతో దావూద్‌ దిగులుతో ఉన్నాడని ముంబైలోని దావూద్‌ అనుచరుడు ఇక్బాల్‌ హసన్‌ వెల్లడించినట్లుగా పోలీసులు తెలిపారు కూడా. దీంతో కరాచీలోనే ఉంటున్న దావూద్‌ తమ్ముడు అనీస్‌కు ముఠా నాయకత్వం దక్కే వీలుందని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ మధ్య దావూద్‌ సమక్షంలోనే అనీస్‌కు, చోటా షకీల్‌కు మధ్య విభేదాలు తలెత్తాయని.. అప్పటినుంచి డి గ్యాంగ్‌కు షకీల్‌ దూరంగా ఉంటున్నాడని ఇంటెలిజెన్స్‌ వర్గాలు గుర్తించాయి. దీనిపై దావూద్‌ హెచ్చరించినా కూడా అనీస్‌ తీరు మార్చుకోలేదని.. దాంతో చోటా షకీల్‌ సొంత ముఠా ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నాయి. అయితే దావూద్, చోటా షకీల్‌ల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నాయి. ఆ ఇద్దరు విడిపోతే భారత్‌కు వ్యతిరేకంగా తాము చేపట్టే కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతుందని పాకిస్తాన్‌ భావిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. 

సుమారు 20 దేశాల్లో.. 
భారత్‌తోపాటు పాకిస్తాన్, నేపాల్, చైనా, ఇంగ్లండ్, జర్మనీ, టర్కీ, ఫ్రాన్స్, స్పెయిన్, మొరాకో, యూఏఈ, సైప్రస్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నేపాల్, థాయిలాండ్, మలేసియా, సింగపూర్‌ల వరకూ దావూద్‌ డి కంపెనీ నేర సామ్రాజ్యం విస్తరించిందని నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ గ్యాంగ్‌ ఆస్తులు, వ్యాపార కార్యకలాపాల విలువ 670 కోట్ల డాలర్ల (సుమారు రూ.40 వేల కోట్లు) అని రెండేళ్ల క్రితమే అంచనా వేశారు. కరాచీలో ఆరు వేల చదరపు గజాల విస్తీర్ణమున్న భారీ భవంతిలో నివసిస్తున్న దావూద్‌కు ప్రధానంగా హవాలా కార్యకలాపాల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తోంది. ఇదికాక మాదకద్రవ్యాల రవాణా, బలవంతపు వసూళ్లు, బినామీలతో సినిమాల నిర్మాణం, కిరాయి హత్యలు, రియల్‌ ఎస్టేట్, బెట్టింగ్, ఉగ్రవాదం, నకిలీ నోట్ల చలామణీ వంటి కార్యకలాపాలతో ఒక కంపెనీ తరహాలో వ్యవస్థీకృత నేర సామ్రాజ్యం నడుస్తోంది. ఈ గ్యాంగ్‌ ఆదాయంలో 40 శాతం భారత్‌ నుంచే వస్తుందని అంచనా. ఇక దావూద్‌కు దుబాయ్‌తోపాటు యూఏఈ, బ్రిటన్‌లలో ఇతరుల పేర్లతో చట్టబద్ధమైన ఆస్తులు ఉన్నాయి. ఒక్క ఇంగ్లండ్‌లోనే దావూద్‌ పెట్టుబడులు 45 కోట్ల డాలర్ల (సుమారు రూ.3 వేల కోట్లు) మేర ఉంటాయని తెలుస్తోంది. డి కంపెనీ దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన వజ్రాలను గుజరాత్‌లో సానబెట్టే వ్యవహారాన్ని చోటా షకీల్‌ పర్యవేక్షిస్తాడని, ముంబైలోని గ్యాంగ్‌ సభ్యులకు నెలకు రూ.15 లక్షల దాకా చెల్లిస్తారని పోలీసులు చెబుతున్నారు. 

ముఠాలో 5 వేల మంది సభ్యులు! 
దావూద్‌ ముఠాలో ఐదు వేల మంది దాకా సభ్యులున్నారని.. లష్కరే తొయిబా, అల్‌ కాయిదా వంటి ఉగ్రవాద సంస్థలతో గట్టి సంబంధాలు ఉన్నాయని 2015లో అమెరికా కాంగ్రెస్‌ నివేదికలోనే పేర్కొన్నారు. కొన్నేళ్లు డి గ్యాంగ్‌లో పనిచేసిన చోటా రాజన్, అబూ సలేం, ఫాహీం తర్వాత సొంత ముఠాలు పెట్టుకున్నారు. భారత్‌లో కొందరు మహిళలు దావూద్‌ గ్యాంగ్‌లో పనిచేస్తున్నట్లు కొన్ని నెలల క్రితం వార్తలొచ్చాయి. 

కరాచీలోనే దావూద్‌ 
2015 ఆగస్టులో దావూద్‌ భార్య మెహజబీన్‌ పేరుతో ఉన్న ఒక ఫోన్‌ బిల్లును టైమ్స్‌నౌ టీవీ చానల్‌ సంపాదించింది. ఆ నంబర్‌కు ఫోన్‌ చేసి మాట్లాడగా.. దావూద్‌ నిద్రపోతున్నారనీ, తాను కరాచీలో ఉంటున్నట్టు ఆమె ధ్రువీకరించడం గమనార్హం. కానీ పాకిస్తాన్‌ మాత్రం దావూద్‌ తమ దేశంలో లేడని బుకాయిస్తుంటుంది.

బిట్‌కాయిన్స్‌తో లావాదేవీలు 
తన చట్టవ్యతిరేక నగదు లావాదేవీలు సులువుగా సాగడానికి వీలుగా దావూద్‌ ఇబ్రహీం.. క్రిప్టో కరెన్సీ బిట్‌ కాయిన్స్‌ను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. డి గ్యాంగ్‌ రూ.950 కోట్ల విలువైన బిట్‌ కాయిన్స్‌ సంపాదించిందని అతని సోదరుడు ఇక్బాల్‌ ఇటీవల ఓ ఇంటరాగేషన్‌లో వెల్లడించాడు. ఈ బిట్‌కాయిన్స్‌ను రియల్‌ ఎస్టేట్, మాదకద్రవ్యాలు, ఆయుధాల సరఫరా కార్యకలాపాల్లో చెల్లింపులకుఉపయోగిస్తున్నారని బయటపెట్టాడు.

ఎవరీ చోటా షకీల్‌? 
1988లో దావూద్‌ గ్యాంగ్‌లో చేరిన షకీల్‌ అసలు పేరు షకీల్‌ షేక్‌. దావూద్‌తో పాటు దుబాయ్‌ పారిపోయాడు. 1993 ముంబై పేలుళ్ల కేసుల్లో ప్రధాన నిందితుడు. 2003లో గుజరాత్‌ మాజీ హోంమంత్రి హరేన్‌ పాండ్యా హత్య కేసు సహా అనేక మంది శివ సైనికుల హత్యలతో షకీల్‌కు సంబంధముంది. 2000లో బ్యాంకాక్‌లో డి గ్యాంగ్‌ ప్రధాన శత్రువు చోటా రాజన్‌పై హత్యాయత్నం కూడా షకీల్‌ పన్నిన పథకం ప్రకారమే జరిగింది. డి కంపెనీకి అత్యధిక ఆదాయం వచ్చే భారత్‌లో కార్యకలాపాలన్నిటికీ బాధ్యుడు ఇతనే. దేశంలో కిరాయి హంతకుల ఎంపిక, రిక్రూట్‌మెంట్‌ అంతా షకీల్‌ కనుసన్నల్లోనే జరుగుతుందని చెబుతారు. షకీల్‌ తర్వాత టైగర్‌ (ఇబ్రహీం) మెమన్, ఉస్మాన్‌ చౌధరీ తదితరులు డి ముఠాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 

అనీస్‌కే ముఠా పగ్గాలు? 
కస్కర్‌ అనే ఇంటి పేరున్న కొంకణ ముస్లిం కుటుంబంలో పుట్టిన దావూద్‌కు 11 మంది తోబుట్టువులు ఉన్నారు. వారిలో దావూద్‌ అన్న షాబీర్‌ గ్యాంగ్‌వార్‌లో మరణించగా.. సోదరి హసీనా కొన్నేళ్ల క్రితం గుండెపోటుతో చనిపోయింది. ప్రస్తుతం దావూద్‌ అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా గ్యాంగ్‌ అధీనంలోని ఆస్తులను కుటుంబ సభ్యులకు, ఓ ట్రస్టుకు పంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అమెరికా, ఐరోపా దేశాల్లోని నేర సామ్రాజ్యాలు నడిపే కుటుంబాల మాదిరిగానే ముఠా నాయకత్వాన్ని ఇబ్రహీం కుటుంబసభ్యుల్లో ఒకరికి ఇవ్వాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. ఇదే జరిగితే దావూద్‌ సోదరుడు అనీస్‌కే నాయకత్వం దక్కుతుందని కొందరు చెబుతుండగా.. అనీస్‌కు కూడా వయసు పైబడిందని డి గ్యాంగ్‌ను నడిపే స్థితిలో లేడని వార్తలొస్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement