సాక్షి, తిరువొత్తియూరు: భర్తను హత్య చేసి అదృశ్యమైన భార్య ఏడేళ్ల తరువాత గురువారం ప్రియుడితో సహా పోలీసులకు పట్టుబడింది. వివరాలు.. తూత్తుకుడి జిల్లా కులమన్‌కరిచల్ గ్రామానికి చెందిన సెంథిల్ కూలీ. ఇతని భార్య ముత్తులక్ష్మి(35). వీరికి ముగ్గురు పిల్లలు. ముత్తులక్ష్మి ఆ ప్రాంతంలోని దుకాణంలో పనిచేస్తుండేది. ఈ క్రమంలో దుకాణం యజమాని కుమారుడు మారిరామర్ (30)తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఈ విషయం తెలుసుకున్న రెండు కుటుంబాల వారు వారిని మందలించారు. దీంతో ముత్తులక్ష్మి ప్రియుడితో కలిసి ఒట్టాన్ సత్రం సమీపంలోని వెల్లిమరత్తుపట్టికి ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చేశారు. తన భార్య, పిల్లలు కనబడకపోవడంతో పలు చోట్ల గాలించిన సెంథిల్ చివరకు వారు ఉన్న చోటును తెలుసుకొని అక్కడికి వెళ్లి భార్యను ఇంటికి రమ్మని పిలిచాడు. దీనికి ముత్తులక్ష్మి తిరస్కరించింది.
ఒత్తిడి చేయడంతో..
సెంథిల్ భార్యను ఇంటికి రమ్మని ఒత్తిడి చేయడంతో పథకం ప్రకారం భర్తను పోలియమ్మనూర్‌లోని తోట వద్దకు పిలిపించి ప్రియుడితో కలిసి హత్య చేసింది. తరువాత పిల్లలతో సహా కడలూర్‌కు పారిపోయారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎనిమిది నెలలు తరువాత వారిని అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. తరువాత వారిద్దరూ బెయిల్‌పై విడుదలై అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో వీరి కోసం గాలిస్తున్న పోలీసులు ఊలసత్రం ప్రాంతంలో దాగి ఉన్న ముత్తులక్ష్మి, మారిరామర్‌ను గురువారం అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment