కేసు వివరాలు తెలుపుతున్న బాన్సువాడ రూరల్ సీఐ శ్రీనివాస్ రావు
నస్ల్రుల్లాబాద్ : హత్య చేసి తప్పించుకుందామని అనుకున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని నెమ్లీ గ్రామానికి చెందిన కంతి గంగవ్వ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని బాన్సువాడ రూరల్ సీఐ శ్రీనివాస్ రావు, ఎస్‌ఐ అనిల్ రెడ్డి తెలిపారు. నెమ్లీ గ్రామానికి చెందిన కంతి గంగవ్వకు, బందెబోయి అనే వ్యక్తికి చాలా కాలంగా వివాహేతర సంబంధం ఉంది.
తరచూ గంగవ్వ ఇంటికి వస్తూ ఉండేవాడు. అయితే రెండు నెలలుగా గంగవ్వ బందె బోయిని దూరం పెట్టి వేరే వారితో చనువుగా ఉండటం బందె బోయి భరించలేకపోయాడు. తనను దూరంగా ఉంచడం సహించలేని బందె బోయి కంతి గంగవ్వను హత్య చేయాలని అనుకున్నాడు. అదును కోసం చూస్తున్న బందె బోయి ఆదివారం మైలారం గ్రామంలో గల కొచ్చరు మైసమ్మ ఆలయం వద్ద బంధువుల కార్యక్రమానికి వెళ్లడం గమనించాడు.
ఇదే సరైన సమయమనుకుని గంగవ్వతో చనువుగా ప్రవర్తించి నస్రుల్లాబాద్ వద్ద ఉన్న కర్షగుట్ట ప్రాంతానికి మాయ మాటలు చెప్పి తీసుకెళ్లాడు. ఎవ్వరూ లేని ప్రదేశంలో ఏకాంతంగా గడపాలని గంగవ్వను ప్రేరేపించగా ఆమె వారించి ఒప్పుకోలేదు. ముందుగానే చంపాలని అనుకున్న బందె బోయి కోపోద్రిక్తుడై ఇష్టారీతిన కొట్టాడు. దీంతో పెద్ద బండపై పడ్డ గంగవ్వకు బలమైన గాయాలై తీవ్ర రక్తస్తావం అయింది.
ఫలితంగా అక్కడికక్కడే మరణించింది. గంగవ్వ ఒంటిపై ఉన్న దాదాపు రూ.23వేల విలువ గల బంగారు నగలు, వెండి పట్టీలు, కడాలు తీసుకొని అక్కడి నుంచి వెళ్లి పోయాడు. ఎవ్వరికి అనుమానం రాకుండా ఊరిలోనే ఉంటూ, గ్రామ ప్రజలతో పాటు శవాన్ని చూసేందుకు రావడమే కాక, పోలీసులకు సహకరిస్తునట్లు ప్రవర్తించాడు. శవ పంచనామతోపాటు, అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. పోలీసుల తమ విచారణలో బందె బోయితో సంబంధం ఉందన్న విషయం తెలుసుకుని అతన్ని విచారించగా నిజం ఒప్పుకున్నాడని సీఐ తెలిపారు.
ఎస్‌ఐతోపాటు సిబ్బందికి అభినందనలు
మండలంలో జరిగిన రెండు హత్య కేసులను చాకచక్యంగా తక్కువ సమయంలోనే మండల పోలీసులు ఛేదించారని సీఐ తెలిపారు. గతంలో బొమ్మన్‌దేవ్‌పల్లిలో హత్యకు గురైన కుర్మ గంగవ్వ ఎటువంటి ఆధారాలు లేని హత్య కేసులోను, ప్రస్తుత కంతి గంగవ్వ హత్య కేసులోనూ కీలక పాత్ర పోషించిన ఎస్‌ఐ అనిల్ రెడ్డి, పోలీసులు సంఘమేశ్వర్, సుభాష్‌ను సీఐ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment