మౌన పోరాటం చేస్తున్న బాధితురాలు డొంకాన నిరోష
టెక్కలి: అదనపు కట్నం కోసం భర్తతోపాటు అత్తింటివారు కొన్నేళ్లుగా చిత్రహింసలకు గురి చేశారు. చివరకు పిల్లల్ని నా నుంచి దూరం చేశారు. న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరిగినా సరైన న్యాయం అందలేదు. పిల్లల్ని పంపించేంత వరకూ పోరాటం చేస్తానంటూ కోటబొమ్మాళి మండలం చిన్నసాన గ్రామానికి చెందిన వివాహిత డొంకాన నిరోష తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో మంగళవారం టెక్కలి సీఐ కార్యాలయం ఎదుట మౌన పోరాటానికి దిగింది. అంతకు ముందు సీఐ శ్రీనివాస్‌ను కలిసి తనకు న్యాయం చేయాలని కోరింది. పిల్లలిద్దరూ తండ్రి వద్ద ఉన్నారు. చట్టపరంగా పిల్లల్ని అందజేస్తామని సీఐతో తండ్రి తెలిపాడు. దీంతో ఆమె సీఐ కార్యాలయం ఎదుట బైఠాయించి మౌన పోరాటానికి దిగింది.
బాధితురాలు నిరోష విలేకర్లతో మాట్లాడుతూ...కోటబొమ్మాళి మండలం చిన్నసాన గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు డొంకాన మోహన్‌రావుతో 2016లో తనకు వివాహం జరిగిందన్నారు. సంతబొమ్మాళి మండలం నగిరిపెంట గ్రామానికి చెందిన తన తల్లిదండ్రులు రూ.6లక్షల నగదు, 9 తులాల బంగారం, రూ.50వేల ఆడపడుచుల కట్నం, రూ.70 వేల విలువైన ద్విచక్రవాహనం కట్నంగా ఇచ్చారని తెలిపింది. పెళ్‌లైన రెండు నెలల తర్వాత నుంచి అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారని వాపోయింది. తన భర్త అన్న కృష్ణారావు పలుమార్లు తీవ్రంగా కొట్టారని ఆవేదన చెందింది. అత్తమామలు వజ్రం, రామారావు, బావ కృష్ణారావు, తోటి కోడలు దమయంతి ప్రోద్బలంతో తన భర్త తీవ్రంగా వేధించేవాడని తెలిపింది. తనకు న్యాయం చేయాలని పలుమార్లు స్థానికంగా ఉన్న పోలీసులతో పాటు జిల్లా స్థాయి పోలీసుల చుట్టూ తిరిగానని, అయినా న్యాయం జరగలేదని వాపోయింది. ఇద్దరు పిల్లల్ని తన నుంచి దూరం చేశారని, తక్షణమే పిల్లల్ని తనకు అప్పగించి న్యాయం చేయాలని వేడుకుంది. ఆమెకు కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బి.ప్రభాకరరావు మద్దతు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment