సీటీవో కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న సీటీవో భార్య అంకమ్మ, ఆమె తల్లిదండ్రులు, సోదరుడు
అమలాపురం టౌన్ : ‘‘నా భర్త యన్నం వెంకటేశ్వర్లు (అమలాపురం సీటీవో) మనసు మారాలి.. నన్ను కాపురానికి తీసుకు వెళ్లాలి’’ అనే నినాదాలతోపాటు.. ఆయన తన మెడలో తాళి కడుతున్న ఫొటో ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ భార్య అంకమ్మ నిరసనకు దిగింది. అమలాపురంలో తన భర్త పని చేస్తున్న కార్యాలయం ముందే.. తన తండ్రి నూకకోటి మాచర్లయ్య, తల్లి రమణమ్మ, అన్నయ్య బాలకృష్ణతో కలసి సోమవారం మండుటెండలో నడి రోడ్డుపై ధర్నా చేసింది.
సీటీవో వెంకటేశ్వర్లు తనను గత ఏడాది మార్చి 5న ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని లక్ష్మీనరసింహ ఆలయంలో వివాహం చేసుకున్నారని అంకమ్మ నాటి పెళ్లి ఫొటోలు చూపించారు. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం చౌటుపాలేనికి చెందిన అంకమ్మకు, అదే జిల్లా బద్వీడు చర్లోపల్లికి చెందిన సీటీవో వెంకటేశ్వర్లుకు వివాహమైంది. ప్రభుత్వాధికారినైనా గౌరవంగా ఉండే సాధారణ కుటుంబంలోని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పి, తన కుమార్తెను ఆదర్శ భావాలతో పెళ్లి చేసుకున్నారని అంకమ్మ తండ్రి మాచర్లయ్య విలేకర్లకు తెలిపారు.
నెల రోజుల కాపురం తరువాత తనను వదిలించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంకమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయగా పలుమార్లు తమకు కౌన్సెలింగ్ కూడా చేశారని చెప్పారు. రాజకీయ, అధికార పలుకుబడితో కేసులు లేకుండా తన కుమార్తెకు అన్యాయం చేస్తున్నారని బాధితురాలి తల్లి రమణమ్మ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆందోళనపై సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
సీటీవో కార్యాలయంలోకి వెళ్లి ఆయన ఫోన్ నంబరు తీసుకున్నారు. అంకమ్మ కుటుంబ సభ్యులను స్టేషన్‌కు తరలించి అక్కడ విచారణ జరిపారు. అనంతరం తాము జిల్లా ఎస్పీ విశాల్ గున్నికి నేరుగా ఫిర్యాదు చేస్తామని బాధితురాలి అన్నయ్య బాలకృష్ణ చెప్పారు. అక్కడి నుంచి ఆ కుటుంబం ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు కాకినాడ వెళ్లింది. దీనిపై సీటీవో వెంకటేశ్వర్లును వివరణ కోరేందుకు విలేకర్లు ప్రయత్నించగా ఆయన కార్యాలయంలో అందుబాటులో లేరు. ఫోనుకు కూడా స్పందించలేదు.
విడిపోయేందుకు నా భార్యే నోటీసు ఇచ్చింది : సీటీవోతనతో సంసారం చేయడానికి ఇష్టం లేదని.. తాను వేరేగా ఉండడానికి మెయింటెనెన్స్(భరణం) ఇవ్వాల్సిందిగా తనకు తన భార్య ఈనెల మూడో తేదీన లీగల్ నోటీసు ఇచ్చిందని అమలాపురం సీటీవో వై.వెంకటేశ్వర్లు సోమవారం సాయంత్రం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంలో కోర్టు దాకా వెళుతున్న క్రమంలో పరిష్కారాన్ని అలా కోరుకుంటూ మరో పక్క తనను ఇబ్బంది పెట్టేలా.. తన హోదాకు భంగం కలిగేలా తన కార్యాలయం ముందు ధర్నా చేయడం ఎంత వరకు సమంజసమని సీటీవో ప్రశ్నించారు. ఉదయం నుంచి అందుబాటులో లేని సీటీవో జరిగిన ఘటనపై సాయంత్రం లిఖిత పూర్వక వివరణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment