
గుహవటి: స్నేహితునితో కలిసి మెడికల్ షాప్‌కు వెళ్తున్న 22 ఏళ్ల గారో తెగకు చెందిన యువతిపై మద్యం మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు దాడి చేశారు. అస్సాంలోని గొలపర జిల్లాలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. తమ కులం, మతం కాని వ్యక్తితో తిరుగుతోందని తాగుబోతులు ఈ అకృత్యానికి పాల్పడ్డారు. ఆమెను జుట్టు పట్టుకుని కొట్టారు. దుర్భాషలాడతూ కాళ్లతో తన్నారు. ఆమెతో ఉన్న ముస్లిం యువకుడిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. భయంతో యువతి తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా మరోమారు ఆమెను కాలితో తన్ని ఫోన్ లాక్కున్నారు.
అంతేకాకుండా తమ నిర్వాకాన్ని వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. యువతీ, యువకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జిల్లా ఎస్పీ అమితాబ్ సిన్హా కేసు వివరాలు వెల్లడించారు. యువతికి ఇటీవలే వివాహం నిశ్చయమైందనీ, ఆమె తన ముస్లిం స్నేహితునితో కలిసి మెడికల్ షాప్‌కు వెళ్తుండగా వారిని అపార్థం చేసుకుని నిందితులు ఈ దాడికి పాల్లడ్డారని ఆయన తెలిపారు. వారిద్దరి మధ్య ఉన్న సంబంధమేంటో చెప్పాలని ఆమెను నిలదీశారని ఆయన చెప్పారు. ఈ ఘటనలో 12 మందిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ పేర్కొన్నారు.
దాడికి ప్రోత్సహించిన ప్రధాన నిందితుడిని విచారిస్తున్నామని సిన్హా అన్నారు. ఉద్దేశ పూర్వకంగా ఈ దాడి జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. ఈ గొడవతో మత ఘర్షణలు తెలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అమానుషంగా, అనైతికంగా బాధిత యువతిపై దాడి చేస్తున్నప్పుడు అక్కడున్న వారెవరూ అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం బాధాకరమని మేఘాలయ ఉమెన్ రైట్స్ కార్యకర్త జైనీ సంగ్మా ఆగ్రహం వ్య్తక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment