అమాయకులే ఈమె టార్గెట్‌ | Woman Cheated In Name Of Jobs In Srikakulam | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు టోకరా

Published Fri, Jun 21 2019 8:18 AM | Last Updated on Fri, Jun 21 2019 8:18 AM

Woman Cheated In Name Of Jobs In Srikakulam - Sakshi

పద్మజ, మోసపోయిన బాధిత నిరుద్యోగులు

సాక్షి, శ్రీకాకుళం : ‘మీకు కలెక్టర్‌ కార్యాలయంలో ఉద్యోగం కావాలా... తహసీల్దారు కార్యాలయంలో అటెండర్‌గా చేరుతారా... ఆర్డీవో కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టు ఖాళీగా ఉంది... డబ్బులు కట్టండి.. ఆర్డర్‌ కాపీలు తీసుకోండి’ అంటూ నిరుద్యోగులకు టోకరా వేసింది. ఒకరిద్దరూ కాదు ఏకంగా వందల సంఖ్యల్లోనే నిరుద్యోగులను నిలువున ముంచి రూ.10 కోట్ల వరకూ నొక్కేసి ఎంచక్కా పరారైంది.ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరుకు చెందిన పద్మజ శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేట్‌ స్కూల్లో టీచర్‌గా పనిచేసేది. ఈమెకు భర్త ఉమామహేశ్వరరావు, ఓ కూతురు ఉన్నారు. 2018లో నగరంలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో అరుణప్లాజాలో ఓ ప్లాట్‌ కొనుగోలు చేసి అప్పట్లో అట్టహాసంగా గృహప్రవేశం చేసింది.

అప్పటికే ఈమె చాలామంది నిరుద్యోగుల వద్ద రూ.లక్షల్లో టోకరా వేసి వారికి పంగనామం పెట్టేసింది. దీంతో విసిగిపోయిన బాధితులు ఈమె ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభించారు. కొద్దిరోజులు పోయాక ఈమె అక్కడ్నుంచి ఏడాది కాలంగా మకాం మార్చేసింది. దీంతో అప్పట్లో వన్‌టౌన్‌లో కేసు నమోదైంది. గడిచిన నెల రోజులుగా అరసవల్లి పరిసర ప్రాంతంలో తలదాచుకున్నట్లు తెలియడంతో బాధితులంతా ఈమె ఇంటిని చుట్టిముట్టి పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఈమెను విచారిస్తున్నారు. ఇప్పటికే ఈమెపై 420, 468, 471 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శుక్రవారం అరెస్టు చూపించే అవకాశాలు ఉన్నాయంటూ పోలీసులు తెలిపారు.

అమాయకులే ఈమె టార్గెట్‌..
వాస్తవంగా ఈమె అమాయకపు నిరుద్యోగులనే లక్ష్యం చేసుకుంది. ఫలానా ఊర్లో ఎవరైనా నిరుద్యోగులు ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నారని తెలిసిన వెంటనే తక్షణమే అక్కడ ప్రత్యక్షమయ్యేది. అక్కడ వారితో నేను ఫలానా దగ్గరి నుంచి వచ్చానంటూ పరిచయం చేసుకోవడం, ఆపై ఆర్డీవో... ఎమ్మార్వో...కలెక్టర్‌ వారి పిల్లలకు చదువు చెబుతున్నానంటూ మోసపూరిత మాటలతో నమ్మించి బుట్టలో వేసుకునేది. 

అధికారుల సంతకాలు ఫోర్జరీ చేస్తూ..
జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పోస్టులు ఉన్నాయంటూ అధికారుల సంతకాలు చేసిన ఫోర్జరీ పోస్టింగ్‌ ఆర్డర్‌ కాపీలు ఒక్కొక్కరికి చూపించి రూ.లక్షల్లో వసూళ్లు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిరుద్యోగ బాధితులను కలిసినప్పుడల్లా డబ్బులు ఇస్తేనే పోస్టింగ్‌ ఆర్డర్‌ ఇస్తానంటూ సెల్‌ఫోన్‌లో చూపిస్తూ వారిని నమ్మించేది. ఇలా వందకు పైగా బాధితులు ఈమె మోసానికి బలైన సంఘటన ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.   డబ్బులు అడిగే బాధితులకు సుమారు రూ.80 లక్షలకుపైగా ఐపీ (ఇన్‌సాల్వేషన్‌ పిటిషన్‌) చూపించేది. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనేగాక రాయఘడ, బరంపురం, ఒడిశా తదితర ప్రాంతాల్లోనూ ఈమెకు డబ్బులు ముట్టచెప్పిన బాధితులంతా ప్రస్తుతం స్టేషన్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement