మనస్తాపంతోనే యువకుడి అఘాయిత్యం | Auto Driver Commited Sucide In Srikakulam | Sakshi
Sakshi News home page

యువకుడి బలవన్మరణం!

Published Wed, Jun 19 2019 9:12 AM | Last Updated on Wed, Jun 19 2019 9:12 AM

Auto Driver Commited Sucide In Srikakulam - Sakshi

సాక్షి, ఎచ్చెర్ల (శ్రీకాకుళం) : మండలంలోని పొన్నాడ వంతెన సమీపంలో కాలిన శరీరంతో ఉన్న యువకుని మృతదేహం కలకలం రేపింది. పక్కన పెట్రోల్‌ (ఖాళీ) సీసాలు, మద్యం బాటిళ్లున్నాయి. గుర్తు పట్టేందుకు వీలులేని విధంగా శరీరం కాలిపోయింది. ఎవరో హత్య ఎవరు చేసి ఉంటారని తొలుత అందరూ భావించారు. పోలీసుల దర్యాప్తులో ఆత్మ హత్యగా తేలింది. శ్రీకాకుళం పట్టణ కేంద్రానికి కిలో మీటరు దూరంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. పొన్నాడ వంతెన అనుకుని పోతన్న చెరువు ఉంది. ఆ చెరువు గట్టుపై గుర్తుతెలియని మృత దేహం స్థానికులకు మంగళవారం ఉదయం కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఎచ్చెర్ల ఎస్‌ఐ  వై.కృష్ణ ఆధ్వర్యంలోని పోలీస్‌ సిబ్బంది చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కాలిన గాయాలతో మృతి చెంది ఉండటం, పక్కన పెట్రోల్‌ సీసాలు ఉండటం, మృతుని చెప్పులు, మద్యం బాటిళ్లు, అగ్గి పెట్టి సంఘటన స్థలంలో ఉన్నాయి. ఎవరో సజీవ దహనం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు భావించారు. మృతుడు ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగింది. శ్రీకాకుళం రిమ్స్‌ మార్చురీకి మృతదేహం తరలించి ఆచూకీ కోసం ప్రయత్నం ప్రారంభించారు. మృతదేహం గుర్తించటం కష్టంగా మారింది. మృతదేహం వాట్సప్‌లో హల్‌చల్‌ చేసింది. శ్రీకాకుళం పట్టణంలోని హయత్‌నగర్‌కు చెందిన సెగళ్ల షణ్ముఖరావుకు మృతదేహం ఫొటో చేరింది. మృతదేహం చూసిన ఆయన సోమవారం రాత్రి నుంచి తన అన్న కనిపించక పోవటంతో ఎచ్చెర్ల పోలీసులను సంప్రందించాడు. అనంతరం మార్చురీలో మృతదేహం చూసి తన అన్న సెగళ్ల మోహన్‌రావు (25)గా గుర్తించాడు. మృతుని తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

మనస్తాపంతో అఘాయిత్యం!
మృతుడు మోహన్‌రావు ఆటో డ్రైవర్‌. మద్యానికి బానిసగా మారాడు. ఇటీవల వివాహం కుదిరింది. యువకుని ప్రవర్తన తెలిసిన అమ్మాయి కుటుంబ సభ్యులు వివాహ నిశ్చయం రద్దు చేసుకున్నారు. దీంతో మానసిక పరిస్థితి సైతం సక్రమంగా లేకుండా పోయింది. వృద్ధులైన తల్లిదండ్రులు ఆదినారాయణ, నర్సమ్మ, అన్నయ్య రాజారావు, తమ్ముడు షణ్ముఖరావు ఉన్నారు. తాను చనిపోతానని తరచూ కుటుంబ సభ్యులు వద్ద అంటుండే వాడు. కొద్ది రోజుల నుంచి అపస్మారక స్థితికి చేరేలా మద్యం తాగుతున్నాడు. ఇంటి వద్ద సోమవారం సాయంత్రం ఆటో విడిచి పెట్టాడు. శ్రీకాకుళం బైక్‌పై వెళ్లి రాత్రి 8.30 సమీపంలో తమ్ముడికి బైక్‌ తాళాలు ఇచ్చేశాడు. మద్యం తాగివస్తానని, ఎదురు చూడద్దని తమ్ముడికి చెప్పి వెళ్లిపోయాడు. ఏకాంత ప్రదేశమైన పొన్నాడ వైపు మద్యం బాటిళ్లు, రెండు బాటిళ్లలో పెట్రోల్, అగ్గి పెట్టి తీసుకువెళ్లాడు. మద్యం మత్తులో పెట్రోల్‌ పోసుకుని నిప్పం టించుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల విచారణలో హత్యకు అవకాశం ఉన్న ఒక్క అంశం సైతం చిక్కలేదని ఎస్‌ఐ చెప్పారు. కుటుంబ సభ్యులకు ఎవరిపై అనుమానం సైతం లేదన్నారు. ఆత్మహత్యగా కేసుగా నమోదు చేశామన్నారు. కుటుంబ సభ్యులకు  ఎటువంటి సందేహం ఉన్నా ఆ కోణంలో దర్యాప్తు చేస్తామన్నారు. ఉదయం పెద్ద ఎత్తున స్థానికులు, ప్రయాణికులు సంఘటన స్థలం వద్ద గుమిగూడారు. ఎస్‌ఐ కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement