ఏటీఎంనే ఎత్తుకెళ్లిన దుండగులు | Thieves Looted ATM Machine in Srikakulam | Sakshi
Sakshi News home page

ఏటీఎంనే ఎత్తుకెళ్లారు

Published Sun, Jul 7 2019 8:58 AM | Last Updated on Sun, Jul 7 2019 8:58 AM

Thieves Looted ATM Machine in Srikakulam - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : నగరాలు, పట్టణాల్లో చోరీలు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు గ్రామీణ ప్రాంతాల వైపు కన్నేశారు. ఇది వరకూ ఏటీఎం సెంటర్లో అమాయకులను ఏమార్చి నగదు దోచుకున్న వీరు ఇప్పుడు ఏకంగా ఏటీఎంలను ఎత్తుకుపోతున్నారు. ఇటీవల కొత్తూరులో ఘటన మరవకముందే తాజాగా ఎచ్చెర్ల ఆర్ముడు రిజర్వు పోలీస్‌ కార్యాలయానికి ఆనుకున్న ఏటీఎం సెంటర్‌లో నగదు యంత్రాన్ని పట్టుకుపోయారు. 16వ నంబర్‌ జాతీయ రహదారి పక్కన ఎచ్చెర్ల పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఈ సంఘటన జరగడం గమనార్హం.

విశేషమేమంటే ఇదే ఏటీఎం సెంటర్‌లో మూణ్నెల్ల క్రితం బ్యాటరీలు చోరీ చేయగా, తాజా ఘటనతో అధికారుల భద్రతాపరమైన చర్యల్లో డొల్లతనం మరోమారు బహిర్గతమైంది. ఈ విషయం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. ఈ నెల 4న ఏటీఎంలో రూ. 20 లక్షలు లోడ్‌ చేశారు. బ్యాంకు అధికారుల లెక్క మేరకు రూ. 8.23 లక్షలు ఏటీఎంలో ఉన్నాయి. 700 కిలోలు కలిగిన ఏటీఎం యంత్రం అమర్చిన కింద భాగం హుక్కులు తొలగించారు. యంత్రం విలు వ రూ.4 లక్షలు ఉంటుంది. తమను గుర్తించకుం డా ముందుగానే సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం వాహనంలో తరలించారు. దీన్ని తొలగించడానికి గంటా యాభై నిమిషాలు పడుతుంది. శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి ఈ ఏటీఎం సర్వీస్‌ నుంచి సంబంధాలు తెగిపోయినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. 

పక్కా వ్యూహంతోనే...
ఆర్ముడు రిజర్వు పోలీసుల విజ్ఞప్తి మేరకు 2017 జనవరి 10న ఈ ఏటీఎంను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రారంభించింది. అప్పటి ఎస్సీ త్రివిక్రమ్‌వర్మ దీన్ని ప్రారంభించారు. ఇదే ఏటీఎంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 25న బ్యాటరీలు చోరీకి గురయ్యాయి. మూడు నెలల వ్యవధిలో ప్రస్తుతం ఏటీఎం చోరీకి గురయ్యింది. ఈ రెండు ఘటనలు పరిశీలిస్తే... అప్పట్లో చోరీ చేసిన గుర్తు తెలియని వ్యక్తులే ప్రస్తుతం చోరీ చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక్కడ హైవే పెట్రోలింగ్‌ పోలీసుల నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. నిత్యం రాత్రిళ్లు తనిఖీలు చేస్తున్న వీరు జాతీయ రహదారి పక్కనే ఏటీఎంలో చోరీ తీరును గుర్తించకపోవడం గమనార్హం. పక్కా వ్యూహంతో చేసిన ఈ చోరీలో అంతర్రాష్ట్ర ముఠా హస్తం ఉందా? స్థానిక చోరులు పాత్ర ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దొంగతనంలో కనీసం నలుగురు వరకు ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నారు. 

ఎస్పీ పరిశీలన...
ఎచ్చెర్ల ఎస్‌బీఐ బ్రాంచ్‌ మేనేజర్‌ ముప్పిడి నరేష్‌ శనివారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ అమ్మిరెడ్డి, డీఎస్పీ చక్రవర్తి, సీఐ మల్లేశ్వరావు, ఎస్సై రాజేష్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎస్పీ పోలీస్‌ అధికారులతో సమీక్షించారు. క్లూస్, ఫ్లోరోనిక్స్‌ బృందాలు చోరీ తీరు పరిశీలించాయి. ధ్వంసం చేసిన సీసీ కెమెరాలు, గోడలు, గ్లాస్‌లుపై ఉన్న వేలిముద్రలు సేకరించాయి. బ్యాంకు అధికారులు, ఎస్‌బీఐ ప్రాంతీయ కార్యాలయ అధికారి రామ్‌జీ, ఏటీఎం జనరల్‌ మేనేజర్‌ గణేష్‌ పరిశీలించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement