చీటీల పేరుతో మోసపోయి స్టేషన్‌వద్దకు వచ్చిన బాధిత మహిళలు
బద్వేలుఅర్బన్ : చీటీల పేరుతో ఓ మహిళ వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలను మోసగించి రూ.30లక్షలతో ఉడాయించిన ఘటన బుధవారం పట్టణంలో వెలుగుచూసింది. వారం రోజులుగా సదరు మహిళ కనిపించకపోవడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే పట్టణంలోని మదీనా మసీదు సమీపంలో గల బెస్తకాలనీలో నివసిస్తుండే దస్తగిరమ్మ అనే మహిళ గత కొన్నేళ్లుగా శివానగర్, పూసలవాడ, సుందరయ్యకాలనీ, మదీనామసీదు వీధి, మేదర కాలనీలకు చెందిన సుమారు 60 మంది మహిళలతో చీటీలు నిర్వహిస్తుండేది.
ఆయా ప్రాంతాలకు చెందిన ఒక్కొక్కరు రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు చీటీలు వేశారు. కొన్నేళ్ల పాటు చీటీలు పాడుకున్న వారికి సక్రమంగా చెల్లిస్తూ బాగా నమ్మకం పెంచుకుంది. ఆ తర్వాత 6 నెలలుగా చీటీలు పాడుకున్న వారికి డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేస్తూ వచ్చింది. గట్టిగా అడిగిన వారికి వడ్డీ చెల్లిస్తానని ప్రామిసరీ నోట్లు సైతం రాయించి నమ్మబలికింది. అయితే గత వారం రోజులుగా ఇంటికి తాళం వేసి ఫోన్‌ను సైతం స్విచ్ ఆఫ్ చేసి కనిపించకపోవడంతో బాధితులు మోసపోయినట్లు గుర్తించారు.
లబోదిబోమంటున్న బాధితులు
కాయాకష్టం చేసుకుని సంపాదించకున్న సొమ్ము ఆపద సమయంలో ఉపయోగపడుతుందని ఆశపడి చీటీలు వేసుకున్న మహిళలు మోసపోయినట్లు తెలుసుకుని లబోదిబో మంటున్నారు. వీరిలో కొందరు పిల్లల చదువుల కోసం, మరికొందరు పెళ్లిళ్ల కోసం, గల్ఫ్ దేశాలకు వెళ్లే నిమిత్తం, ఆసుపత్రి అవసరాల కోసం చీటీలు వేసిన వారు ఉండడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. నమ్మకంగా ఉంటూ అందరి వద్ద డబ్బులు వసూలు చేసుకుని ఉడాయించడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చీటీ నిర్వాహకురాలిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment