భారతి మృతదేహం.., ఇన్‌సెట్లో రోదిస్తున్న బాలుడు
మెదక్/పుల్‌కల్(అందోల్): ముఖం నిండా రక్తం మరకలు.. ఒంటినిండా దెబ్బలు.. అవేవీ ఆ బాలుడిని బాధించలేదు. అప్పటివరకూ నవ్వుతూ నవ్వించిన తల్లి కళ్లముందే విగతజీవిగా మారడం చూసి గుండెలవిసేలా రోదించాడు.. ‘డాడీ మమ్మీ కావాలి’ అంటూ మిన్నంటిన చిన్నారి రోదనలు అక్కడున్నవారందరిచేత కంటతడి పెట్టించింది. స్థానికంగా కలచివేసిన ఈ ఘటన పుల్కల్ మండల పరిధిలోని న్యూ ఓన్నపూర్ శివారులోని 161వ జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ సత్యనారాయణ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దశంకరంపేట మండల పరిధిలోని జబ్బికుంట గ్రామానికి చెందిన గాందిరపల్లి సంగమేశ్వర్, భారతి(30) దంపతులు. వారికి శివప్రసాద్ (3) కుమారుడు ఉన్నారు.
హైద్రాబాద్‌లోని ఓల్డ్ బోయినిపల్లి నుంచి శుభకార్యం నిమిత్తం గురువారం బైక్‌పై బయల్దేరారు. ఓన్నపూర్ శివారులోకి రాగానే ముందుగా వెళ్తున్న ట్రక్‌ను ఓవర్‌టేక్ చేయబోగా బైక్ వెనుకాల కూర్చున్న భారతి ఆమె ఒళ్లో కూర్చున్న శివప్రసాద్ ఇద్దరూ కిందపడిపోయారు. ట్రక్ వెనుక చక్రాలు అమె తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రీ, కొడుకులు గాయాలతో బయటపడ్డారు. రక్తం మడుగులో పడి ఉన్న తల్లి మృతదేహాన్ని చూసి శివప్రసాద్ ‘‘డాడీ మమ్మీ కావాలంటూ’’ ఏడుస్తూ రోడ్డుపై అలాగే కూర్చుండిపోయాడు. ఇది చూసిన అక్కడున్నవారంతా కంటతడిపెట్టారు. పోస్టుమార్టం నిమిత్తం భారతి మృతదేహాన్ని సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. గాయపడిన తండ్రీకొడుకులను అదే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణమైన ట్రక్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment