గోపన్‌పల్లి శివారులో లక్ష్మి మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ పాండురంగారెడ్డి, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు లక్ష్మి(ఫైల్)
దేవరకద్ర రూరల్: మండలంలోని గోపన్‌పల్లి శివారులోని కోళ్లఫారాల పక్కనున్న వ్యవసాయ పొలంలో ఆదివారం తెల్లవారుజామున పూర్తిగా కాలిపోయి మృతిచెందిన ఓ మహిళ శవాన్ని గ్రామస్తులు గుర్తించి పోలీసులు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతురాలు గోపన్‌పల్లి గ్రామానికి చెందిన కోట్ల లక్ష్మి(45)గా పోలీసులు గుర్తించారు. వారి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. గోపన్‌పల్లికి చెందిన కోట్ల గోపాల్‌రెడ్డితో ధన్వాడ మండలం మందిపల్లికి చెందిన లక్ష్మికి గత 30 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. అయితే లక్ష్మి అనుమానాస్పదంగా పూర్తిగా కాలి మృతిచెంది వ్యవసాయ పొలంలో శవమై తేలింది.
విషయం తెలుసుకున్న సీఐ పాండురంగారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎస్‌ఐ వెంకటేశ్వర్లును వివరాలను అడిగి తెలుసుకొన్నారు. పోలీసు జాగిలాలతో సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. శవ పంచనామ అనంతరం మృతురాలి శవాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే గత కొన్ని రోజులుగా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, తన కూతురు లక్ష్మిని అల్లుడు గోపాల్‌రెడ్డి చంపి నిప్పంటించి ఉంటాడని మృతురాలి తల్లి వెంకటమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment