
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జరిగిన సంచలన హత్యకేసు మిస్టరీని పోలీసులు ఒక్కరోజులోనే ఛేదించారు. వాయవ్య ఢిల్లీలోని రోహినీ ప్రాంతంలో బుధవారం హత్యకు గురైన మహిళ కేసులో ఆమె భర్తను అరెస్టు చేశారు. 34 ఏళ్ల ప్రియా మెహ్రాను ఆమె భర్త పంకజ్ మెహ్రా హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఉద్దేశపూరితంగా భార్యను చంపి.. అది తనకు అప్పు ఇచ్చిన వ్యక్తి మీద నెట్టేందుకు బూటకపు దాడి జరిగినట్టు నమ్మించేందుకు పంకజ్ ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. ప్రియా మెహ్రా వాహనంలో ఉండగానే ఆమెను పంకజ్ కాల్చిచంపాడు. ఆ సమయంలో వారి రెండేళ్ల కొడుకు ప్రియా ఒడిలో ఉన్నాడు. ఆ చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదు.
ముగ్గురు-నలుగురు వ్యక్తులు కారులో వచ్చి తమ వాహనాన్ని అడ్డుకున్నారని, ఆ తర్వాత తన భార్యను కాల్చిచంపి పరారయ్యారని బూటకపు కథనాన్ని పంకజ్ పోలీసులకు చెప్పాడు. అయితే, సంఘటనాస్థలంలో రెండో వాహనం లేకపోవడం.. అతడు చెప్పిన ఆనవాళ్లు ఏమీ దొరక్కపోవడంతో పోలీసులు అతడు చెప్పేది అనుమానించారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో పంకజ్ నిజాన్ని ఒప్పుకున్నాడని, వ్యాపారంలో నష్టాలు రావడంతో రూ. 40 లక్షల వరకు అతను అప్పులు చేశాడని పోలీసులు తెలిపారు. పంకజ్‌కు మరో మహిళతో వివాహం అయిందని, ప్రియాతో అతను కలిసి ఉండటం లేదని పోలీసు వర్గాలు తెలిపాయి. 11 ఏళ్ల కిందట ప్రియా-పంకజ్‌కు పెళ్లయిందని, ఇటీవల తమకు పుట్టిన కొడుకు కారణంగా ఇద్దరూ మళ్లీ కలిసి ఉంటున్నారని ఆ వర్గాలు వివరించాయి. భార్య హత్యను అప్పు ఇచ్చిన వ్యక్తి మీద తోసేస్తే.. రూ. 40 లక్షలు తిరిగి కట్టాల్సిన అవసరం ఉండదని అతడు భావించినట్టు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment