మాట్లాడుతున్న జైపూర్ ఏసీపీ సీతారాములు, మృతురాలు రాజేశ్వరి (ఫైల్)
చెన్నూర్: మండలంలోని కంబోజిపేట అటవీ ప్రాంతంలో హత్య చేసి, కిరోసిన్ పోసి కాల్చి చంపిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో హత్య వివరాలను జైపూర్ ఏసీపీ సీతారాములు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన బైన రాజేశ్వరికి (38) దుగ్నెపల్లికి చెందిన బడుగు రాజయ్యతో గత 23 ఏళ్ల క్రితం వివాహమైంది. రాజేశ్వరికి కొడుకు పుట్టిన తర్వాత భర్తను వదిలి వెళ్లిపోయి మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది.
పెద్దనాన్న కూతురు రాజేశ్వరి చెడు తిరుగుళ్లు తిరుగుతూ కుటుంబ పరువు పోగొడుతుందని కిష్టంపేట గ్రామానికి చెందిన పున్నేశ్ ఆరు నెలల క్రితం చెన్నూర్ పట్టణంలోని జగన్నాథాలయం సమీపంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని ఇచ్చాడు. పోషణ భారం కాకుండా చెన్నూర్ పట్టణంలోని ఒక బట్టల షాపులో ఉద్యోగం ఇప్పించాడు. ఇక నుంచి మంచిగా బతుకుతుందని ఆశించినా అక్క వ్యవహార శైలిలో మార్పు రాలేదు. దీంతో పున్నేశ్ అక్కను హతమార్చాలనే పథకం పన్నాడు.
నీకో వ్యక్తితో పరిచయం చేస్తానని నమ్మించి గత జనవరి 30 రాత్రి కిష్టంపేట వైపు వెళ్తున్న కారును లిఫ్ట్ అడిగి లంబాడిపల్లి ప్రాంతానికి తీసుకెళ్లాడు. కారు వెళ్లిపోయిన తర్వాత గొంతుకు చున్నీ చుట్టి హతమార్చాడు. శవాన్ని పక్కన పెట్టి రాత్రి ఇంటికి వచ్చాడు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అడవికి వెళ్లి కట్టెలు తెస్తానని తండ్రి ఎల్లయ్యకు చెప్పి ఎడ్లబండి తీసుకుని వెళ్లాడు. శవాన్ని బండిలో వేసుకుని కంబోజిపేట సమీపంలో దట్టమైన అటవీ ప్రాంతంలో వరిగడ్డి వేసి కిరోసిన్ పోసి కాల్చేశాడు.
ఫిబ్రవరి 4న అటవీ ప్రాంతంలో శవం కాలి ఉన్న విషయాన్ని గమనించిన పశువుల కాపరి కిష్టంపేట సర్పంచ్‌కు వివరించాడు. సర్పంచ్ ఫిర్యాదుతో కంబోజిపేట అటవీ ప్రాంతానికి వెళ్లి శవాన్ని పరిశీలించారు. సంఘటన స్థలంలో లభించిన ఆనవాళ్ల ప్రకారం తాళాలు వేసి ఉన్న ఇళ్లను పరిశీలించగా పట్టణంలోని జగన్నాథాలయ సమీపంలో గల ఒక ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించి ఇల్లు అద్దెకు తీసుకున్న పున్నేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. పున్నేశ్ తనే హత్య చేశానని అంగీకరించాడు. ఈ మేరకు హత్యానేరం కేసు నమోదు చేసుకొని రిమాండ్‌కు తరలించారు. మిస్టరీని ఛేదించిన విషయంలో సహకరించిన హెడ్‌కానిస్టేబుల్ బాలయ్య, కానిస్టేబుల్ శ్యాంలను ఏసీపీ అభినందించారు. సమావేశంలో సీఐ కొరె కిశోర్‌కుమార్, ఎస్సై ప్రవీణ్‌కుమార్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment