గద్వాల క్రైం: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన మండలంలోని కాకులారంలో శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన లక్ష్మణ్, యశోదమ్మ(40) దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గ్రామంలోనే పలువురికి అప్పులు ఇస్తు.. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే తెలిసిన వ్యక్తులకు అప్పుగా ఇచ్చిన క్రమంలో తిరిగి చెల్లించేందుకు వచ్చిన వారితో మాట్లాడటం భర్తకు రుచించలేదు. దీంతో ఇద్దరి మధ్య పలుమార్లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే గురువారం రాత్రి సైతం ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన యశోదమ్మ పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ఈమె భర్త లక్ష్మణ్ పరారీలో ఉండటం గమనార్హం.
పోలీసులకు అందించిన ఫిర్యాదులో..
భార్యాభర్తలు ఇద్దరూ గురువారం అర్ధరాత్రి గొడవ పడినట్లు బంధువులు, వారి పిల్లలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రపోయిన తర్వాత 12.50 గంటల సమయంలో తండ్రి లక్ష్మణ్ తమ తల్లి యశోదమ్మను ఆరుబయట వేసి.. పురుగు మందు తాగిందని చెప్పి కనిపించకుండా వెళ్లాడని తెలిపారు. అయితే తండ్రి లక్ష్మణ్ తాను కూడా చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాసి వదిలి వెళ్లిన లెటర్‌ను పోలీసులకు అందించారు. సూసైడ్ నోట్‌లో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వివిధ బ్యాంకుల్లో అప్పుల వివరాలు, ఖర్చులు.. ఇక బంధువుల పిల్లలను, తన కుమారులను బాగా చూసుకోవాలని లెటర్‌లో కోరారు.
గొంతు నులిమి హత్య
యశోదమ్మను భర్త గొంతు నులిమిన ఆనవాళ్లు, స్వరపేటికపై ఘాట్లు ఉన్నాయి. అయితే తనపై అనుమానం రాకుండా హత్య చేసిన అనంతరం పురుగు మందు తాపి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశా రు. భార్యపై పెంచుకున్న అనుమానమే హత్యకు దారితీసి ఉంటుందని బంధువులు వాపోయారు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి లక్ష్మణ్ పరారీలో ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ సంఘటనపై అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఆస్పత్రి ప్రాగణంలో రోదిస్తున్న బంధువులు
మహిళ అనుమానాస్పద మృతి
Published Sat, Mar 31 2018 12:41 PM | Last Updated on Tue, Nov 6 2018 8:50 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment