ఆత్మహత్య చేసుకున్న సుజాత అగర్వాల్ , పక్కన సుజాత అగర్వాల్ (ఫైల్)
చీపురుపల్లి విజయనగరం : ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో...తెలియదుగాని ఆ కష్టాన్ని ఎవరితో చెప్పుకోవాలో తెలియకో... లేదంటే ఎవరితో చెప్పి వారిని బాధించడం ఎందుకు అనుకుందో తెలియదుగాని శాశ్వతంగా లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. మరో రెండు రోజుల్లో కాశీ వెళ్తేందుకు కూడా ఏర్పాట్లు చేసుకున్నారట.
మరి ఆ కాశీ విశ్వేశ్వరున్ని దర్శించుకునే భాగ్యం ఆమెకు లేదేమో.. చిన్న, చితకా ఆర్థిక సమస్యలు అనుకుందామంటే అదీ కాదు. ఎందుకంటే స్థానికంగా మైనింగ్ వ్యాపారాల్లో నంబర్‌వన్‌గా ఉన్న వ్యాపారి భార్య ఆమె. అయినప్పటికీ భర్త ఇంట్లో లేని సమయంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.
వివరాల్లోకి వెళ్తే... పట్టణంలోని వెంకటేశ్వరనగర్‌లో నివాసం ఉంటున్న సుజాత అగర్వాల్(47) మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఊరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా కలచివేసింది.
ఉదయం 11 గంటల సమయంలో ఇంటికి వచ్చిన అల్లుడు మనోజ్‌కుమార్ చాలా సేపు తలుపులు కొట్టినప్పటికీ తీయకపోవడంతో స్థానికుల సహకారంతో మరోసారి ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఎస్‌ఐ టి.కాంతికుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆ ఇంటికి చేరుకుని తలుపులు విరగ్గొట్టి చూసేసరికి ఊరి వేసుకొని సుజాత అగర్వాల్ మృతదేహం కన్పించింది.
మృతురాలి భర్త మైనింగ్ వ్యాపారి ఓంప్రకాష్ అగర్వాల్(పప్పు అగర్వాల్) మైనింగ్ వ్యాపారం పని నిమిత్తం సోమవారం రాయఘడ వెళ్లారు. రాత్రికి ఆయన ఇంటికి రాలేదు. మంగళవారం ఉదయం సమాచారం తెలుసుకుని మధ్యాహ్నం 3 గంటల సమయంలో నివాసానికి చేరుకున్నాడు.
మృతురాలు సుజాత అగర్వాల్ కుమారుడు నితీష్ అగర్వాల్ రాజాం పట్టణంలోని జీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో తృతీయ సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్నాడు. విషయం తెలుసుకున్న నితీష్ తల్లి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యాడు.
ఏమైందో...
ఆమెకు ఎలాంటి కష్టం లేదు. ఎందుకు ఇలా చేసిందో నాకు తెలియదు. సోమవారం రాయగడ వెళ్లాను. నాతో ఏమీ చెప్పలేదు. ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లం. నన్ను చూసుకునే దిక్కు కూడా ఇప్పుడు లేదు. దేశంలో ఆమెను ఎన్నో పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లాను. మరో రెండు రోజుల్లో కాశీ వెళ్లేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. ఆమె ఏం చెప్పినా చేసేవాడిని. తనకు ఏదైనా సమస్య ఉంటే చెబితే బాగున్ను. - ఓంప్రకాష్ అగర్వాల్, మృతురాలి భర్త
దర్యాప్తు చేస్తున్నాం.....
మాకు కూడా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దర్యాప్తు చేస్తున్నాం. భర్త, కుమారుడితో మాట్లాడుతున్నాం. కుటుంబ సభ్యులు మధ్య అంతగా సత్సంబంధాలు కనిపించడం లేదు. కేసు నమోదు చేస్తున్నాం. దర్యాప్తు నిర్వహిస్తాం. - టి.కాంతికుమార్, ఎస్‌ఐ
Comments
Please login to add a commentAdd a comment