వివంత గర్ల్స్‌ హాస్టల్‌’లో మహిళ మృతి | Women Died in Lift Accident Girls Hostel Hyderabad | Sakshi
Sakshi News home page

లిఫ్ట్‌ గుంతలో జారిపడి మహిళ మృతి

Published Sat, Apr 20 2019 8:05 AM | Last Updated on Sat, Apr 20 2019 8:05 AM

Women Died in Lift Accident Girls Hostel Hyderabad - Sakshi

మృతురాలు రేఖ(ఫైల్‌)

హిమాయత్‌నగర్‌: పై అంతస్తు లోనుంచి కిందికి దిగే క్రమంలో లిఫ్ట్‌ ఎక్కేందుకు సిద్ధపడిన ఓ మహిళ గుంతలో పడి ప్రాణాలు కోల్పోయింది. లిఫ్ట్‌ రాకుండానే దాని డోరు తెరుచుకోవడంతో ఆమె ఒక్కసారిగా కిందపడిపోయింది. ఈ దుఘటన గురువారం నారాయణగూడ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరగ్గా.. శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. జియాగూడకు చెందిన కె.రేఖ(45) హిమాయత్‌నగర్‌ తెలుగు అకాడమీ సమీపంలోని ‘వివంత గర్ల్స్‌ హాస్టల్‌’లో స్వీపర్‌గా పనిచేస్తోంది. ఎప్పటిలాగే గురువారం ఉదయం పనిలోకి వచ్చి హాస్టల్‌లోని గదులు శుభ్రం చేసి సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైంది. ఐదో అంతస్తులో ఉన్న రేఖ లిఫ్ట్‌ బటన్‌ నొక్కింది. లిఫ్ట్‌ వచ్చిందని గేట్‌ తీసి కాలు ముదుకేయడంతో ఒక్కసారిగా ఫస్ట్‌ ఫ్లోర్‌లో ఉన్న లిఫ్ట్‌పై పడిపోయింది. ఈ ప్రమాదంలో రేఖ తలకు బలమైన గాయాలు కావడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా ఆమె మార్గమధ్యలోనే మరణించింది. హాస్టల్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సైదులు తెలిపారు. 

తాగి పడిపోయిందన్న యజమాని
వివంత గర్ల్స్‌ హాస్టల్‌ను శివ అనే వ్యక్తి నడుపుతున్నాడు. హాస్టల్‌ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే రేఖ చనిపోయినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై హాస్టల్‌ యజమానిని ‘సాక్షి’ వివరణ కోరగా.. రేఖ మద్యం తాగి డ్యూటీకి వచ్చిందని, అందుకే వెళ్లేప్పుడు లిఫ్ట్‌ గేటు తీసి కిందపడిపోయి చనిపోయిందన్నారు. అయితే, మద్యం తాగిన ఆమె ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులన్నీ చేయగలిగింది కానీ..లిఫ్ట్‌ని మాత్రం గుర్తించలేకపోయిందా అంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

రెండేళ్ల క్రితం నారాయణగూడలో..
నారాయణగూడ ఏఐటీయూసీ భవన్‌లోని ‘యునైటెడ్‌ ఇండియా ఇన్సురెన్స్‌’లో డెవలప్‌మెంట్‌ అధికారిగా పనిసే ఆనందరావు రెండేళ్ల క్రితం ఇలాంటి దుర్ఘటనలోనే ప్రాణాలు కోల్పోయారు. కార్యాలయంలో విధులు ముగించుకుని బయటకు వెళ్లే క్రమంలో ఆయన మూడో అంతస్తులో లిఫ్ట్‌ బటన్‌ను నొక్కారు. లిఫ్ట్‌ వచ్చిందనుకుని గేటు లాగి కాలు లోపలికి వేయడంతో జారి కిందపడి అక్కడిక్కడే మృతిచెందారు. గురువారం జరిగిన ఘటనలోను రేఖ అలాగే ప్రాణాలు కోల్పోయింది. పలు భవనాల్లో నిత్యం వినియోగించే లిఫ్ట్‌లను సరిగా నిర్వహించకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు గానే లిఫ్టుల ఏర్పాటుకు ‘లిఫ్ట్‌ ఇన్స్‌పెక్టర్‌ సర్టిఫికెట్‌’ ఉండాలనే ప్రతిపాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే, ఇంత వరకూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జీహెచ్‌ఎంసీలో సైతం భవన నిర్మాణాల్లో లిఫ్టుల ఏర్పాటు, నిర్వహణపై కూడా నిబంధనలు లేకపోవడం గమనార్హం.   

నిర్వహణ పట్టించుకోని అధికారులు
పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్యం కారణంగా తరచూ లిఫ్ట్‌ ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం మృతి చెందిన పి.ఆనందరావు, గురువారం ప్రాణాలు కోల్పోయిన రేఖ లిఫ్ట్‌ కంటే ముందు గేటు తెరుచుకోవడం వల్లే మరణించడం గమనార్హం. లిఫ్టులు, వాటి నిర్వహణను జీహెచ్‌ఎంసీలోని ఏ విభాగమూ పట్టించుకోవడం లేదు. ఇక్కడ లిఫ్ట్‌ ఇన్‌స్పెక్టర్లు సైతం లేకపోవడం సిగ్గుచేటు. తప్పనిసరి అనుకుంటే పొరుగు రాష్ట్రం నుంచి పిలిపించి సర్టిఫై చేసుకోవాల్సిన దుస్థితి మన నగరంలో ఏర్పడింది. భవనం ఎత్తును బట్టి 10 మీటర్లు దాటితే లిఫ్ట్‌ ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ, లిఫ్టుల స్టెబిలిటీ, నిర్వహణకు మాత్రం ఎలాంటి నిబంధనలు లేవు. ఏటా వేల సంఖ్యలో భవనాలు నిర్మాణం జరుగుతున్న జీహెచ్‌ఎంసీలో లిఫ్ట్‌ ఇన్‌స్పెక్టర్‌ లేకపోవడం దారుణమని విమర్శలు వినిపిస్తున్నాయి.
వ్యాపార సంస్థలతో పాటు నివాస అపార్ట్‌మెంట్లలోనూ లిఫ్టులతో అప్రమత్తంగా ఉండాలి. నిర్ణీత వ్యవధుల్లో సర్వీసు చేయించడం, లిఫ్ట్‌ ఆపరేటర్‌ విధుల్లో ఉండేలా చూడడం తప్పనిసరి.  
సామర్థ్యాన్ని బట్టి ముగ్గురు పట్టే లిఫ్టుల నుంచి 40 మంది వరకు వెళ్లగలిగే లిఫ్టులు వాడుకలో ఉన్నాయి. సాధారణంగా సామర్థ్యానికి మించి ఎక్కువమంది ఎక్కినా కదలకుండా మొరాయించడం.. తలుపులు వేయకపోతే పనిచేయకపోవడం వంటి ఏర్పాట్లు లిఫ్టుల్లో ఉంటాయి. కానీ దీర్ఘకాలం పాటు సర్వీసులో ఉన్న లిఫ్ట్‌లు సాంకేతిక లోపాలతో ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నాయి.  

నిర్వహణలో నిర్లక్ష్యం..
స్టెబిలిటీ లేకపోవడం.. నాసిరకం లిఫ్టులు వాడటం ప్రమాదాలకు ఒక కారణం కాగా, కనీస నిర్వహణ లేకపోవడం ప్రమాదాలకు తావిస్తోంది.
లిఫ్టులో ఆపరేటర్‌ తప్పనిసరిగా ఉండాలి. కానీ నగరంలో చాలా భవనాల్లో ఆపరేటర్‌ అన్న ఊసే ఉండదు.  
పనిచేసే ‘అలార్మ్‌’ బెల్‌ ఉండాలి. లేని పక్షంలో కనీసం ఫోన్‌ చేసేందుకు వీలుగా ల్యాండ్‌లైన్‌ ఉండాలి. ఇవి ఎక్కడా కానరావు.  
సాధారణంగా లిఫ్ట్‌ ఏర్పాటు సమయంలోనే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ప్రైవేటు సంస్థలు సంబంధిత లిఫ్ట్‌ కంపెనీలతో ఏఎంసీ(యాన్యువల్‌ మెయింటనెన్స్‌ కాంట్రాక్ట్‌) కుదుర్చుకుంటాయి. నిర్ణీత వ్యవధుల్లో పరీక్షించడం, అవసరాన్నిబట్టి పరికరాలు సరఫరా చేయడం, తగిన మరమ్మతులు చేయాలి. కానీ ఇవి దాదాపు ఉండనే ఉండవు.  
విద్యాసంస్థలు, ఆస్పత్రుల్లాంటి వాటిల్లో ఇవి మరింత పకడ్బందీగా ఉండాలి.  
అత్యవసర సమయాల్లో ఫోన్‌ చేసేందుకు వీలుగా సంబంధిత ఎమర్జెన్సీ నెంబర్లు లిఫ్టులో కనబడేలా ఉండాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement