
మృతి చెందిన రమణమ్మ
చీపురుపల్లి: అక్రమ మార్గంలో నడుస్తున్న భార్యను సరిదిద్దాలనుకున్నాడు.. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా ఆమెలో మార్పు రాలేదు. ప్రియుడితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్న భార్యను చూసి రగిలిపోయాడు. చివరకు తాను నడుపుతున్న లారీతోనే వారిని ఢీకొట్టాడు. ఈ సంఘటనలో భార్య మృతి చెందగా, ప్రియుడు తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. గురువారం మధ్యాహ్నం చీపురుపల్లి పట్టణం నుంచి లావేరు వెళ్లే రోడ్డులో శ్రీ కనకమహలక్ష్మి అమ్మవారి ఆలయ సమీపంలో జరిగిన ఈ సంఘటనతో అంతా ఉలిక్కిపడ్డారు.
స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటనకు సంబంధించి సీఐ సీహెచ్.శ్యామలరావు, ఎస్సై టి.కాంతికుమార్, స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గరివిడి మండలంలోని కాపుశంభాం గ్రామానికి చెందిన రేగాన తవిటయ్య, రమణమ్మలు భార్యాభర్తలు. తవిటయ్య లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇదిలా ఉంటే రమణమ్మకు అదే గ్రామానికి చెందిన రేగాన రామకృష్ణతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం భర్త తవిటయ్య చాలా కాలం కిందటే గుర్తించి భార్యను పలుమార్లు హెచ్చరించాడు. ఎన్నిసార్లు చెప్పినా భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు.
సుభద్రాపురం రమ్మని..
ఇదిలా ఉంటే తవిటయ్య హుజూరాబాద్ నుంచి పర్లాకిమిడికి లారీతో బుధవారం బయలుదేరాడు. అదే సమయంలో భార్య రమణమ్మకు ఫోన్ చేసి డ్వాక్రా అప్పు చెల్లించేందుకు డబ్బులు ఇస్తానని గురువారం ఉదయం సుభద్రాపురం రావాలని సమాచారం ఇచ్చాడు. తాను కూడా చెప్పిన సమయానికి సుభద్రాపురం చేరుకుని భార్య కోసం ఎదురు చూశాడు. మధ్యాహ్నం వరకు భార్య రాకపోవడంతో ఆమె కోసం ఆరా తీశాడు.
ఇంతలో ప్రియుడు రేగాన రామకృష్ణతో కలిసి మధ్యాహ్నం చీపురుపల్లిలో బయిలుదేరినట్లు తెలుసుకున్నాడు. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన తవిటయ్య ఎలాగైనా ఇద్దరినీ హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. అదే తడువుగా లారీతో చీపురుపల్లి వైపు వస్తుండగా కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్దకు వచ్చేసరికి ఎదరుగా ద్విచక్ర వాహనంపై రామకృష్ణతో కలిసి వస్తున్న భార్యను చూశాడు. వెంటనే వారి వాహనాన్ని లారీతో ఢీకొట్టాడు. దీంతో రమణమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, రామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. తవిటయ్య లారీను అక్కడే వదిలి పరారయ్యాడు.
హత్య కేసు నమోదు చేశాం....
ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలా నికి వెళ్లాం. ఆ తర్వాత లారీ డ్రైవరే మృతురాలి భర్తని తెలిసింది. దీంతో ఆరా తీస్తే వివాహేతర సంబంధాలే కారణమని తెలు స్తోంది. లారీ క్యాబిన్‌లో వీరిద్దరి ఫొటోలు కూడా లభించాయి. హత్య కేసుగా నమోదు చేస్తున్నాం.
పోలీసుల అదుపులో తవిటయ్య..?
ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టి భార్య మృతికి కారణమైన తవిటయ్య పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. కాని ఆయన కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సంఘటనా స్థలంలోనే లారీని వదిలి పట్టణంలోకి వచ్చిన తవిటయ్య ఓ హోటల్‌లో మద్యం సేవించి భోజనం చేసి ఆ హోటల్ యాజమాన్యంతో గొడవ పడినట్లు తెలి సింది. దీంతో వారు హోటల్ నుంచి బయటకు గెంటేసినట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. అక్కడి నుంచి ఓ మద్యం దుకాణంలో మద్యం సేవిస్తూ ఉండగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment