రాజేంద్రనగర్: మహిళపై అత్యాచారం చేసి దారుణంగా కాల్చి చంపిన నిందితుడిని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ జగదీశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం... శివరాంపల్లి ఇందిరారెడ్డినగర్ ప్రాంతానికి చెందిన ఎం.పద్మమ్మ(38), తిరుపతయ్యలు దంపతులు. వీరు గత నెల 30న కూలీ పని కోసం బహదూర్‌పురా అడ్డా వద్దకు వెళ్లారు. పని దొరకకపోవడంతో సాయంత్రం ఇంటికొస్తూ దానమ్మ జోపిడీ వద్ద గల కల్లు కాంపౌండ్‌కు వెళ్లారు.
ఇద్దరూ కల్లు సేవిస్తుండగా మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతానికి చెందిన ఎం.విష్ణు(28) అలియాస్ చక్రం వీరితో మాటలు కలిపాడు. గతంలో ఇడ్లీలు విక్రయించే సమయంలో పద్మమ్మ, తిరుపతయ్యలకు విష్ణుతో పరిచయం ఏర్పడింది. తనకు రాఘవేంద్ర కాలనీలోని తెలిసిన మార్వాడీ ఇళ్లల్లో పని ఉందని చెప్పి.. పద్మమ్మకు పని కల్పిస్తానని నమ్మించాడు. దీంతో పద్మమ్మ తన భర్త తిరుపతయ్యను ఇంటికి పంపి.. తాను పని చూసుకుని వస్తానని విష్ణుతో వెళ్లింది.
వాళ్లిద్దరూ ఆటోలో రాఘవేంద్ర కాలనీ వద్ద దిగి అక్కడే ఉన్న మార్వాడీ ఇంట్లో పని మాట్లాడుకుని ఇంటికి బయలుదేరారు. కొద్దిదూరం వెళ్లగానే విష్ణు.. శాస్త్రీపురంకు వెళ్లే దారిలో గుండా వెళదామని చెప్పి పద్మమ్మను తీసుకెళ్లాడు. అక్కడే ఉన్న జీహెచ్‌ఎంసీ పార్కులోకి తీసుకెళ్లి పద్మమ్మపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటనతో కోపగించుకున్న పద్మమ్మ జరిగిన విషయాన్ని పోలీసులకు, భర్తకు చెబుతానని విష్ణును బెదిరిండంతో.. పక్కనే ఉన్న బండరాయితో ఆమె తలపై బాది చంపేశాడు.
తర్వాత అక్కడి నుంచి ఇంటికెళ్లి బట్టలు మార్చుకుని మద్యం సేవించాడు. తిరిగి పార్కుకు చేరుకుని మరోసారి బండరాయితో మోది ఆమె మెడలోని బంగారు పుస్తె, ముక్కు పుడక, పట్టగొలుసులు, కమ్మలను తీసుకున్నాడు. మృతదేహాన్ని గుర్తుపట్టకుండా పార్కులో ఉన్న చెత్తా, చెదారాలు వేసి కాల్చివేశాడు. అక్కడ నుంచి ఇంటికి తిరిగి వెళ్లాడు. స్థానికులు పార్కులో మంటలు చూసి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు మృతదేహాన్ని పద్మమ్మదిగా గుర్తించి ఆమె భర్త ఇచ్చిన సమాచారంతో విష్ణు కోసం పోలీసులు గాలించడం మొదలు పెట్టారు. సోమవారం ఉదయం వైన్స్ షాపు వద్ద కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.∙
Comments
Please login to add a commentAdd a comment