మధుమిత మృతదేహం
సుల్తాన్‌బజార్: ఒడిషాకు చెందిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన శుక్రవారం అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ కుమార్తెను ఆమె భర్త హత్య చేశాడని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. ఒడిషాలోని, బరంపురం జిల్లాకు చెందిన దత్తర జైనా కుమార్తె మధుమితకు (26) అదే ప్రాంతానికి చెందిన కాంట్రాక్టు ఉపాధ్యాయుడు ప్రశాంత్ కుమార్‌తో 2013లో వివాహం జరిగింది. పెళ్లయిన కొద్ది నెలలకే అదనపు కట్నం తేవాలని ప్రశాంత్ భార్యను వేధిస్తుండేవాడు. దీంతో ఆమె పలుమార్లు పుట్టింటికి వెళ్లి అతడు అడిగిన డబ్బులు తెచ్చి ఇచ్చింది.
భర్త వేధింపులు తాళలేక పుట్టింటికి వెళ్లి పోవడంతో పెద్దలు పంచాయితీ చేసి కాపురానికి పంపారు. ఈ నెల 13న ఇద్దరూ కలిసి రైలులో నగరానికి వచ్చారు. 14న స్థానిక రంగ్‌మహల్ చౌరస్తాలోని శ్రీ సాయి రెసిడెన్షియల్ లాడ్జిలో 206 గది అద్దెకు తీసుకున్నారు. అనంతరం ఇద్దరూ కలిసి నగరంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. సాయంత్రం బయటికి వెళ్లి భోజనం చేసి లాడ్జికి తిరిగి వచ్చారు. అర్థరాత్రి మధుమిత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో ఆమె భర్త ఆటోలో నాంపల్లి కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ విషయమై అతను మృతురాలి తండ్రికి సమాచారం అందించడంతో మృతురాలి తండ్రి, మేనమామ కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు వచ్చారు. తన కూతురిని ఆమె భర్తే గొంతు నుమిలి హత్య చేసి అనారోగ్యంతో చనిపోయిందని కట్టుకథ అల్లుతున్నాడని ఆరోపిస్తూ వారు అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు లాడ్జిలోని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment