పోలీసులు,ఆందోళన కారుల మధ్య తోపులాట
ఓర్వకల్లు: నన్నూరు గ్రామస్తులు కన్నెర్రజేశారు. బండ్లవాగు వారధి వద్ద కల్లంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణం తొలగించకపోవడంతో మూకుమ్మడిగా దాడి చేశారు. షాపులో ఉన్న ఫర్నీచర్, ఫ్రీజ్‌లు, మద్యం సీసాలను ధ్వంసం చేశారు. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి..
గ్రామంలోని మోక్షిత్ వైన్ షాపు ప్రజాజీవనానికి ఇబ్బందికరంగా మారింది. బస్టాండ్‌కు లేదా పాఠశాలకు వెళ్లాలంటే మద్యం షాపు ముందు నుంచే వెళ్లాలి. ఆ దుకాణం వద్ద కొందరు నిలబడి మద్య తాగడం.. దారిలో వెళ్లే మహిళలు, విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం చేస్తున్నారు. తమకు ఇబ్బంది కలిగిస్తున్న మద్యంషాపును తొలగించాలని మహిళలు సీపీఎం ఆధ్వర్యంలో పలుమార్లు అధికారులు, పోలీసులకు కలిసి వినతిపత్రాలిచ్చారు. అయినా, ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 24 వ తేదీన జాతీయ రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తహసీల్దార్ రజనీకుమారి స్పందించి ఈ నెల 29 వ తేదీలోగా షాపు తొగించేందుకు చర్యలు తీసుకుంటామని హామీచ్చారు.
గడువు తీరినా షాపు తీయించకపోవడంతో ఆగ్రహించిన మహిళలు, సీపీఎం నాయకులు మంగళవారం మద్యం దుకాణంపై దాడి చేసి షాపులో ఉన్న ఫర్నీచర్, ఫ్రీజ్‌లతో పాటు మద్యం సీసాలను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న కర్నూలు తాలూకా రూరల్ సీఐ నాగరాజుయాదవ్, ఓర్వకల్లు ఎస్‌ఐ చంద్రబాబు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆందోళన కారులు, పోలీసుల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. దుకాణంపై దాడిలో సుమారు రు.3 లక్షల ఆస్తినష్టం సంభవించడంతో పాటు, కౌంటర్‌లోని రూ.10 వేల నగదు అదృశ్యమైనట్లు షాపు నిర్వాహకుడు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
15 మందిపై కేసు నమోదు: మద్యం షాపుపై దాడికి పాల్పడిన సీపీఎం నాయకులు రామకృష్ణ, నాగన్న, షాజాహాన్, వడ్ల మాసూంబాషా, వడ్ల మహబూబ్‌బాషా, ప్రమీలమ్మతో పాటు మరో 9 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రబాబు తెలిపారు. పరిస్థితులు చక్కబడే వరకు గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మద్యం దుకాణాదారుడికి ఓ రాజకీయ నాయకుడి అండదండలున్నాయని..అందుకే అధికారులు తమ గోడు పట్టించుకోవడం లేదని గ్రామ మహిళలు ఆరోపిస్తున్నారు.
మద్యం షాపు తొలగించాల్సిందే
కర్నూలు(కొండారెడ్డిఫోర్ట్): నన్నూరులో మద్యం షాపు తొలగించాల్సిందేనని సీపీఎం ఆధ్వర్యంలో గ్రామస్తులు ఎక్సైజ్æ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా ఉపాధ్యక్షురాలు నిర్మలమ్మ మాట్లాడుతూ తాము ఇబ్బంది పడుతున్నామని మహిళలు ఆందోళనలు చేస్తున్నా మద్యం షాపు నడపడం దారుణమన్నారు. నన్నూరులో మహిళల పట్ల ఎస్‌ఐ చంద్రబాబు దారుణంగా వ్యవహరించారని డీఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మహిళలను దూషించిన ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నన్నూరు గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment