సాక్షి, విశాఖ : నగర శివారు జీవీఎంసీ 5వ వార్డులోని మధురవాడ వాంబే కాలనీలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సంచలనం రేపిన ఈ హత్యకు ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరే కారణమని భావిస్తున్న పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రి 11:30 గంటల సమయంలో జరిగిన ఘటనకు సంబంధించి స్థానికులు, పీఎం పాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వాంబేకాలనీ జీఎఫ్ 6లో నివసిస్తున్న విల్లపు రమణబాబు సుమారు 8 సంవత్సరాల కిందట వాల్తేరు ప్రాంతం నుంచి కుటుంబంతోసహా ఇక్కడికి తరలివచ్చాడు.
ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న అతనికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడు రాంబాబు(24) అలియాస్ రాము పెయింటింగ్ పనులు చేస్తూ ఆటో కూడా నడుపుతాడు. అదే కాలనీలో నివసిస్తున్న వెంకట్ అనే యువకుడు ఒక వర్గం, రాంబాబు మరో వర్గం నడుపుతున్నారు. ఈ క్రమంలో తరచూ ఈ రెండు వర్గాల నడుమ ఘర్షణలు, కొట్లాటలు జరుగుతుండేవి. వీరిపై పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి రాంబాబును అంతమొందించాలని వెంకట్ ప్రణాళిక రచించాడు. తమ గ్యాంగు ఉన్న ప్రాంతం వైపునకు మంగళవారం రాత్రి 11 గంటల తర్వాత రాంబాబు రావడాన్ని వెంకట్ గమనించాడు. ఇదే అదనుగా కత్తులు, బీరు బాటిళ్లతో ఒక్కసారిగా దాడి చేసి క్రూరంగా హత్య చేశారు. ఒకదశలో ప్రాణాలు కాపాడుకునేందుకు రాము పారిపోతున్నా వెంకట్ వర్గం వెంబడించి మరీ హతమార్చారు. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురై అక్కడి నుంచి పరుగులు తీశారు.
విషయం తెలుసుకున్న సీఐ రవికుమార్ ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. హత్యకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీశారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రాంతంలో గొడవలు జరగకుండా నగర కమిషనర్ ఆర్‌కే మీనా ఆదేశాల మేరకు ఆనందపురం, పద్మనాభం సీఐల పర్యవేక్షణలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతుని సోదరుడు సింహాచలం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మృతుడు రాముపై పలు కేసులున్నాయని తెలిపారు.
హత్యకు దారితీసిన వర్గపోరు
పెద్దగా చదువుకోని స్థానిక యువకులు కొందరు గంజాయి, మద్యానికి బానిసలై అల్లరచిల్లరగా తిరుగుతున్నారు. వాంబేకాలనీకి సమీపంలోని ఒక ప్రాంతంలో రాత్రి వేళ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ గొడవలకు దిగుతున్నారు. వీరంతా బరితెగించినా పోలీసులు కనీస చర్యలు చేపట్టలేదు. మరోవైపు స్థానికులు కూడా మనకెందుకులే అని అటువైపు చూడడం మానేశారు. ఈ క్రమంలోనే వెంకట్, రాంబాబు వర్గాలుగా విడిపోయి రెచ్చిపోయారు.
కొద్దిరోజుల కిందట రాంబాబు, వెంకట్ వర్గాల మధ్య జరిగిన కొట్లాటలో అంజి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ క్రమంలో జరిగిన దాడి రాము ప్రాణాలను తీసేసింది. వర్గపోరు హత్యల వరకూ దారి తీయడం పట్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే పోలీసులు స్పందించి కాలనీలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment