
మృతుడు సురేష్
కొవ్వూరు రూరల్ : కన్నవాళ్లను పున్నామ నరకం నుంచి తప్పిస్తాడనుకున్న కొడుకు తమ కళ్ల ముందే విద్యుత్ షాక్‌తో విగతజీవుడిగా మారడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు ఆ తల్లిదండ్రులు. విద్యుత్ షాక్ నుంచి తల్లిదండ్రులను కాపాడబోయి ప్రాణాలు వదిలాడు కొవ్వూరు మండలం సీతంపేటకు చెందిన యువకుడు దంగుడుబియ్యం సురేష్ (19). స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి వర్షం పడుతున్న సమయంలో సురేష్ తల్లి కరుణమ్మ ఇంటి బయట వైరుపై ఆరబెట్టిన బట్టలు తీస్తుండగా ఆ వైరుకు ప్రమాదవశాత్తూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో విద్యుదాఘాతానికి గురైంది.
ఇది చూసిన సురేష్ తండ్రి శ్రీనివాస్ ఆమెను కాపాడబోయి అతనూ షాక్‌కు గురయ్యాడు. ఈ క్రమంలో సురేష్ తల్లిదండ్రులను కాపాడడానికి వెళ్లి వారిని రక్షించాడు. ఈ సమయంలో సురేష్‌కు విద్యుత్ షాక్ కొట్టడంతో స్పృహ కోల్పోయాడు. వెంటనే కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సురేష్ శ్రీనివాస్ దంపతులకు మొదటి సంతానం. ఒక కుమార్తె దేవి పదో తరగతి చదువుతుంది. చిన్నప్పటి నుంచి కుటుంబం కోసం కష్టపడు తూ ప్రస్తుతం లారీ కార్మికుడిగా జీవిస్తున్నాడు.