
మణికంఠ (ఫైల్)
తూర్పుగోదావరి ,పి.గన్నవరం: సరదాగా ప్రకృతి ఒడిలో సేద తీరదామని వచ్చిన ఓ యువకుడు అదే ప్రకృతిలో ప్రాణాలను కోల్పోయాడు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వచ్చిన అతడిని మృత్యువు కాటేసింది. మారేడుమిల్లి నుంచి 14 కిలోమీటర్ల దూరంలోని పర్యాటక ప్రాంతం అమృతధార జలపాతం వద్దకు ఆదివారం సాయంత్రం పి.గన్నవరం మండలం ముంగండ గ్రామానికి చెందిన పాలూరి మణికంఠ (23) స్నేహితులతో వాహనంలో వచ్చాడు. స్నానం చేసేందుకు అమృతధార జలపాతం పైకి ఎక్కగా ప్రమాదవశాత్తూ పైనుంచి జారి పడ్డాడు. అతని శరీరానికి బలంగా బండరాళ్లు తగలడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అతనిని స్నేహితులు వారు వచ్చిన వాహనంలో రంపచోడవరం ఆస్పత్రికి తీసుకు వెళ్లేసరికే అతడు మృతి చెందాడు.
ముంగండలో విషాద ఛాయలు
ముంగండ ముత్యాలమ్మ గుడి ప్రాంతానికి చెందిన మణికంఠ మరణించినట్టు సమాచారం రావడంతో అతడి తల్లిదండ్రులు, బంధువుల కన్నీరుమున్నీరుగా విలపించారు. అతడి తండ్రి ఆదినారాయణ కొబ్బరి కాయలు గ్రేడింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. తల్లి వెంకటలక్ష్మి గృహిణి. వీరికి అతడు ఏకైక సంతానం. అతడు కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. చేతికి అందివచ్చిన ఏకైక కుమారుడు తిరిగిరాని లోకానికి వెళ్లిపోవడంతో తల్లి,దండ్రులు, బంధువులు బోరున విలపిస్తున్నారు.