ప్రాణస్నేహితుల మధ్య ప్రేమ పగ | young man killed his friend with love affair | Sakshi
Sakshi News home page

ప్రాణస్నేహితుల మధ్య ప్రేమ పగ

Published Thu, Feb 15 2018 7:43 AM | Last Updated on Wed, Aug 1 2018 2:31 PM

young man killed his friend with love affair - Sakshi

హత్యకు గురైన హరీష్‌(ఫైల్‌) హరీష్‌ మృతదేహం, నిందితుడు సంతోష్‌

దొడ్డబళ్లాపురం: ప్రేమికుల రోజు వారి జీవితాల్లో విషాదం నింపింది. ఒక అమ్మాయి ప్రేమ కోసం ఇద్దరు మిత్రులు గొడవపడి కత్తితో పొడవడంతో ఒకరి ప్రాణం పోయింది. ఈ సంఘటన తాలూకాలోని కంచిగనాళ గ్రామంలో చోటుచేసుకుంది. కంచిగనాళ గ్రామం నివాసులయిన సంతోష్‌ (24), హరీష్‌ (24) చిన్నప్పటి నుండి ఆప్త స్నేహితులు. సంతోష్‌ వ్యవసాయం చేసుకుంటుండగా, హరీష్‌ చదువు సగంలో వదిలేసి షేర్‌ ఆటో డ్రైవర్‌గా ఉన్నాడు. ఇలా ఉండగా ఏడాది కాలంగా హరీష్, ఇదే గ్రామానికి చెందిన ఒక యువతి పరస్పరం ప్రేమించుకున్నారు. ఇదే సమయంలో ఆ యువతి తమ కులం అమ్మాయి కావడంతో సంతోష్‌ కూడా ఇష్టపడి ప్రేమించడం ప్రారంభించాడు. ఈ విషయంలో స్నేహితులు కొంతకాలంగా శత్రువులుగా మారారు.

తరచూ అమ్మాయి ప్రేమ కోసం కొట్టుకున్నారు. ఈ క్రమంలో గత వారం అమ్మాయికి హరీష్‌ ఆటోలో అమ్మాయికి లిఫ్ట్‌ ఇచ్చాడట. ఈ విషయం తెలుసుకున్న సంతోష్‌ హరీష్‌తో ఘర్షణపడి బెదిరించాడు. ఈ విషయమై హరీష్‌ గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు విచారణ కోసం గ్రామానికి వచ్చి సంతోష్‌ ఇంటికి వెళ్లారు. దీనిని అవమానంగా భావించిన సంతోష్‌ మంగళవారం రాత్రి గ్రామంలోని అశ్వత్థకట్ట వద్ద హరీష్‌తో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే సంతోష్‌ కత్తితో హరీష్‌ గొంతు, ఎద భాగాల్లో విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితున్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందాడు. సంతోష్‌ పరారయ్యాడు.

గ్రామస్థుల్లో భయాందోళన
ప్రేమ పేరుతో యువకులు జీవితాలను నాశనం చేసుకోగా, ఇన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న కంచిగనాళ గ్రామంలో కొత్తగా కుల కక్షలు రాజుకోవడం పట్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హరీష్, సంతోష్, వీరి ప్రేమికురాలి ఇళ్లు గ్రామంలో ఒకే వీధిలో ఉండడంతో ఎప్పుడేం గలాటా జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా ఎస్పీ అమిత్‌సింగ్, ఏఎస్పీ మల్లికార్జున్, డీవైఎస్పీ నాగరాజు, సీఐ సిద్ధరాజు సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

ప్రేమలేఖలో కొత్త విషయాలు
గురువారం నాడు మృతుని తల్లితండ్రులు హరీష్‌కు సంబంధించిన వస్తువులు పరిశీలించగా కొన్ని లవ్‌ లెటర్లు లభించాయి. అవన్నీ హరీష్‌ ప్రేమిస్తున్న అమ్మాయి రాసినవే. ఆమె ఇద్దరు యువకులతోనూ ప్రేమ సాగిస్తోందని తేలింది. ముఖ్యంగా అమ్మాయి హరీష్‌ వల్ల గర్భవతి అయిన సంగతి తెలిసింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులే సంతోష్‌ను ఉసిగొల్పి తమ కొడుకును హత్య చేయించారని హరీష్‌ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తక్కువ కులానికి చెందిన తమ కుమారుడికి అమ్మాయినిచ్చి వివాహం చేయడం ఇష్టంలేకే హత్య చేయించారని చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement