సాక్షి, కారేపల్లి(ఖమ్మం): సెల్ ఫోన్ ఇవ్వలేదంటూ చెల్లిపై అలిగిన ఓ అన్న ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు గత నెల 22న ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు 26వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీన్ కట్ చేస్తే..
కారేపల్లి మండలం శాంతినగర్ ఓపెన్ కాస్ట్ దిబ్బల కిందనున్న రోడ్డుపై శనివారం ఉదయం వెళుతున్న కొందరు పశువుల కాపరులకు ఎక్కడి నుంచో దుర్వాసన వచ్చింది. అనుమానంతో చుట్టూ చూశారు. దిప్పలప ఓ చెట్టుకు చున్నీతో వేలాడుతున్న తల, కిందనే మొండెం కనిపించాయి. వారు బెంబేలెత్తారు. గ్రామస్తులతో చెప్పారు. సమాచారమందుకున్న ఎస్‌ఐ పి.వెంకన్న వచ్చారు. మృతదేహాన్ని పరిశీలించారు. అక్కడ దొరికిన ఆధార్ కార్డు, సెల్ ఫోన్ ఆధారంగా ఆ మృతదేహాన్ని ఇల్లందు పట్టణంలోని 14 నెంబర్ బస్తీకి చెందిన లకన్‌లాల్ పాసి(21)గా గుర్తించారు.
ఇల్లెందులోని బియ్యం దుకాణంలో గుమస్తాగా ఇతడు పనిచేస్తున్నాడు. గత నెల 22న, సెల్‌ఫోన్ ఇవ్వాలని తన చెల్లిని అడిగాడు. ఆమె నిరాకరించటంతో అలిగాడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. ఇక్కడ శవమయ్యాడు. నిర్మానుష్య ప్రాంతమైన ఓసీ దిబ్బలపై చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. లకన్‌లాల్ పాసి తండ్రి చోటేలాల్ పాసి ఫిర్యాదుతో కేసును కారేపల్లి ఎస్‌ఐ పి.వెంకన్న దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment