
టీ.నగర్: వివాహం కాలేదని విరక్తి చెందిన ఓ వ్యక్తి వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అదృష్టవశాత్తు కారుపై పడడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటన చెన్నై మైలాపూరులో ఆదివారం రాత్రి జరిగింది. చెన్నె తిరువాన్మయూరు ప్రాంతానికి చెందిన సుందరం కుమారుడు వసంత్ (31) ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. అతనికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అనేక ప్రాంతాల్లో అమ్మాయిని చూశారు. ఏవీ కుదరలేదని సమాచారం. గత వారం ఓ సంబంధం చూశారు. అక్కడ కూడా కుదరకపోవడంతో వసంత్ మనస్థాపానికి గురయ్యాడు.
ఆదివారం రాత్రి మైలాపూర్, రాయపేట హైరోడ్డులోని వంతెనపై నుంచి దూకాడు. అదే సమయంలో అటువైపు వెళుతున్న కీల్పాక్కం సెక్రటేరియట్ కాలనీకి చెందిన జూనైత్ (29) కారుపై పడ్డాడు. వంతెనపై నుంచి దూకిన వసంత్ తీవ్రంగా గాయపడ్డాడు. కారు ముందు అద్దాలు దెబ్బతిన్నాయి. కారు నడుపుతున్న జూనైత్ స్వల్పంగా గాయపడ్డాడు. ఈ సమాచారం అందుకున్న మైలాపూరు పోలీసులు గాయపడిన వసంత్‌ను చికిత్సలకోసం రాయపేట ప్రభుత్వాస్పతికి తరలించారు. ఈ సంఘటనతో రాయపేట హైరోడ్డులో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment