
లక్ష్మిప్రియాంక(ఫైల్)
సాక్షి, నాగోలు: ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ యువతి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎల్‌బీనగర్ సీఐ అశోక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుంటి జంగయ్యనగర్ కాలనీలో నివాసం ఉండే జ్యోతి జీహెచ్‌ఎంసీలో ఉద్యోగి. జ్యోతి భర్త ప్రేమ్‌దాస్ గతంలోనే చనిపోయాడు. కుమారుడు ప్రదీప్‌కుమార్, కుమారై లక్ష్మిప్రియాంక(19)లతో కలిసి ఉంటోంది. లక్ష్మి ప్రియాంక ప్రస్తుతం కొత్తపేటలోని శ్రీనేత్ర చికిత్సాలయంలో ఉద్యోగం చేస్తోంది. శనివారం ఉదయం యాథావిధిగా తల్లి ఉద్యోగానికి వెళ్లగా సోదరుడు ప్రదీప్‌కుమార్ పని నిమిత్తం బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం 12గంటల సమయంలో వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తి ఇంటికి వచ్చి డోర్ కొట్టగా తీయలేదు. దీంతో తలుపు పగలగొట్టి చూడగా లక్ష్మిప్రియాంక ఉరేసుకొని కనిపించింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రదీప్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.