యువకుడి ఆత్మహత్యాయత్నం | Youngmen Commits Suicide infront of Lover Home | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్యాయత్నం

Published Mon, Jun 3 2019 10:13 AM | Last Updated on Mon, Jun 3 2019 10:13 AM

Youngmen Commits Suicide infront of Lover Home - Sakshi

యుగంధర్‌గౌడ్‌(ఫైల్‌)

బంజారాహిల్స్‌:  జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న యువతి(22)ని ప్రేమ పేరుతో వేధిస్తూ బ్లాక్‌మెయిల్‌ చేయడమేగాక పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఓ యువకుడు ఏకంగా యువతి ఇంటికి వెళ్లి ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన గద్వాల్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో నిందితుడిపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదై ఉంది. వివరాల్లోకి వెళితే.. గద్వాల్‌కు చెందిన యుగంధర్‌గౌడ్‌ జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ మియాపూర్‌లో ఉంటున్నాడు. అదే కార్యాలయంలో పనిచేస్తున్న యువతితో అతడికి పరిచయం ఏర్పడటంతో ప్రేమిస్తున్నానని అమె వెంటపడుతున్నాడు. దీనిపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో యాజమాన్యం అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది.

అయితే..  గత మార్చి 26న యుగంధర్‌ ఆమె కార్యాలయానికి వచ్చి మళ్లీ వేధించడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా ఆమె సొంత ఊరైన గద్వాల్‌కు వెళ్లి తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. గత ఏప్రిల్‌ 18న ప్రేమించకపోతే అంతు చూస్తానంటూ బాధితురాలితో పాటు ఆమె తల్లిదండ్రులను హెచ్చరించాడు. దీంతో ఏప్రిల్‌ 19న బాధితురాలు జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి అతడిని రిమాండ్‌కు తరలించారు. 20 రోజుల పాటు జైలుశిక్ష అనుభవించి గత నెలలో బెయిల్‌పై విడుదలయ్యాడు. ప్రతి వారం జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో హాజరై సంతకం చేయాలని కోర్టు కండీషన్‌ బెయిల్‌ మంజూరు చేసింది. తాను మారిపోయానని జైలు జీవితం పగవాడికి కూడా వద్దని పోలీసులకు చెప్పే యుగంధర్‌ మూడు రోజుల క్రితం పెట్రోల్‌ బాటిల్‌తో సహా గద్వాల్‌లోని ఆమె ఇంట్లోకి వెళ్లి పెళ్లి చేసుకోవాలని బెదిరించాడు. బాధితురాలి కుటుంబసభ్యులు అతడిని  బయటికి గెంటి తలుపు మూశారు. దీంతో వారి ఇంటి ఎదుటే పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిని యుగంధర్‌ను గద్వాల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే.. అతను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడా? సదరు యువతిపై పెట్రోల్‌ పోద్దామని వచ్చాడా? అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement