సాక్షి, హైదరాబాద్: తన చెల్లిని ప్రేమిస్తున్నాడనే కోపంతో ఓ యువకుడు మరో యువకుడిని కిరాతకంగా హత్య చేశాడు. రమేష్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి తన చెల్లిని ప్రేమిస్తున్న మహేష్(28)ను హతమార్చాడు. కారులో తీసుకెళ్లి మద్యం తాగించి చంపి పెట్రోల్ పోసి తగులబెట్టారు. రమేష్ కారును సర్వీసింగ్‌కు ఇచ్చినపుడు సర్వీసింగ్ సెంటర్ సిబ్బంది కారులో రక్తపు మరకలు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివరాల ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు.
నిందితులను పట్టించిన కారులో రక్తపు మరకలు
గొంతు కోసి దారుణంగా చంపారు.. నిర్జన ప్రదేశంలోని చెట్ల పొదల్లో మృతదేహంపై పెట్రోల్ పోసి కాల్చేశారు.. అంతా పక్కాగా చేశామనుకున్న నిందితులు చిన్నతప్పుతో దొరికిపోయారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. 28 ఏళ్ల వయసున్న యువకుడి మృతదేహం శంషాబాద్ మండలం మదనపల్లి సమీపంలో కాలిన స్థితిలో పడి ఉందని సమాచారం అందడంతో ఏసీపీ అశోక్‌కుమార్, సీఐ కృష్ణప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్‌ను రప్పించగా శునకాలు సంఘటన స్థలం నుంచి అడ్డదారిలో మామిడితోట మీదుగా హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి వరకు వెళ్లి ఆగాయి. అక్కడి నుంచి నిందితులు కారులో పరారైనట్లు కారు టైర్ల గుర్తులను బట్టి పోలీసులు అనుమానించారు. ఎక్కడో హత్య చేసి ఆనవాళ్లు దొరకకూడదని మృతదేహంపై పెట్రోల్ పోసి కాల్చేసినట్లు భావించారు.
మృతుడి చేతికి వెండి బ్రాస్‌లెట్, బొటన వేలుకు రాగి ఉంగరం ఉన్నాయి. కారులో పెట్టుకునే మొబైల్ ఛార్జర్, చెప్పులు, పెట్రోల్ తెచ్చిన అయిదు లీటర్ల ఖాళీ డబ్బా సంఘటన స్థలంలో లభించాయి. విచారణ అనంతరం మృతుడు హైదరాబాద్ జియాగూడకు చెందిన మహేశ్ పోలీసులు గుర్తించారు. కాగా, శంషాబాద్‌లోని ఓ కార్ల సర్వీసింగ్ కేంద్రానికి సోమవారం ఉదయం ఇద్దరు వ్యక్తులు వచ్చి కారును సర్వీసింగ్‌కు ఇచ్చారు. కారును శుభ్రం చేసేందుకు సిబ్బంది తలుపు తెరవగా అందులో రక్తపు మరకలు కనిపించాయి. వెంటనే సర్వీసింగ్ సెంటర్ యజమాని ఆర్జీఐఏ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వారు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ కారులోనే యువకుడి గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment