
న్యూఢిల్లీ: తండ్రి స్థానంలో తండ్రిలా వచ్చిన వ్యక్తి... కూతురు వరుసయ్యే తన చెల్లెలిపై లైంగిక వేధింపులకు పాల్పడుతుండడం చూడలేకపోయిన ఓ యువకుడు... మారుతండ్రిని హత్యచేశాడు. స్థానికంగా కలకలం క్రియేట్ చేసిన ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది.
న్యూఢిల్లీలోని బాబా హరిదాస్ నగర్‌లో 20 ఏళ్ల కొడుకు, 15 ఏళ్ల కూతురితో నివాసం ఉంటోంది ఓ మహిళ. ఆమె భర్త 2012లో ఓ ప్రమాదంలో చనిపోయాడు. ఆ తర్వాత అదే ఏరియాకు చెందిన ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోందామె. ఫలితంగా వీరికి ఓ ఏడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. భర్తకు పుట్టిన పిల్లలతో ఆమె ఓ ఇంట్లో నివసిస్తుంటే... ఏడేళ్ల కుమారుడితో కలిసి ప్రియుడు మరో ఇంట్లో ఉండేవాడు. అయితే ప్రియురాలి ఇంటికి సమీపంలో ఓ షాపు నడిపిస్తున్న అతను, అప్పుడప్పుడు ఆమె ఇంటికి వెళ్లేవాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న 15 ఏళ్ల బాలికపై కన్నేశాడు. బుధవారం ఆమె ఇంటికి వెళ్లిన అతను... ఒంటరిగా ఉన్న బాలికను లైంగికంగా వేధించడం మొదలెట్టాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆమె అన్న... కూతురు వయసయ్యే బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని చూసి షాకయ్యాడు.
తీవ్ర ఆవేశంతో అక్కడే ఉన్న కత్తిని తీసుకుని దాడి చేసి... అతన్ని కసి తీరా పొడిచి చంపాడు. తర్వాత పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. పోలీసులు వచ్చే దాకా వేచి చూసి... తర్వాత లొంగిపోయాడు. ఈ సంఘటన జరిగిన సమయంలో వారి తల్లి, పని మీద బయటికి వెళ్లడం విశేషం. చెల్లెలిపై అత్యాచారానికి యత్నిస్తున్న తల్లి ప్రియుడిని చూడగానే ఆవేశానికి లోనై, కత్తితో పొడిచి చంపేసినట్టు ఒప్పుకున్నాడు సదరు యువకుడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి ఉపయోగించిన కత్తిని సీజ్ చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment