
ప్రతీకాత్మకచిత్రం
పట్నా : దేశంలో మూకహత్యలు కొనసాగుతున్నాయి. డబ్బులు గుంజుకెళ్లాడనే ఆరోపణలపై ఓ వ్యక్తిని చితకబాదడంతో బాధితుడు మరణించిన ఘటన బిహార్‌లోని సీతామరి జిల్లాలో వెలుగుచూసింది. తన వద్ద డబ్బును లాక్కునాడని ఓ వ్యాన్ డ్రైవర్ చెప్పడంతో రూపేష్ అనే వ్యక్తిని స్ధానికులు చుట్టుముట్టి తీవ్రంగా గాయపరిచారని పోలీసులు చెప్పారు.
మూక దాడిలో గాయపడిన బాధితుడిని తొలుత సదర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అనంతరం పట్నా మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాధితుడు మరణించాడని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి 150 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నామని డిప్యూటీ ఎస్పీ వీర్ ధీరేంద్ర చెప్పారు.
కాగా నేరస్తుడనే ముద్ర వేసి నడిరోడ్డుపై వ్యక్తులను చావబాదడానికి ఏ చట్టం అనుమతించిందని బాధితుడి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూక దాడులు, హత్యలతో న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.