
తక్షణ సాయంగా లక్ష రూపాయలు చెల్లించనున్న ప్రభుత్వం.. కేసు విచారణ పూర్తైన తర్వాత మరో రెండు లక్షల రూపాయలు అందజేయనుంది.
పట్నా : మూక హత్యల బాధిత కుటుంబాలకు 3 లక్షల రూపాయల సాయం అందించాలని బిహార్ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు తక్షణ సాయంగా లక్ష రూపాయలు చెల్లించనున్న ప్రభుత్వం.. కేసు విచారణ పూర్తైన తర్వాత మరో రెండు లక్షల రూపాయలు అందజేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి మూక హత్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. అలాగే ఇలాంటి ఘటనలకు సంబంధించిన కేసు విచారణ త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రోజువారీగా విచారణ చేపట్టి ఆరు నెలల్లోగా నిందితులకు శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు.
కాగా పిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠాలు దిగాయంటూ వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో వదంతులు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో మూకహత్యలు పెరిగిపోతున్నాయి. వీటితో పాటుగా ఆవులను అక్రమంగా రవాణా చేస్తున్నారనే కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఇటువంటి హత్య కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.