సయ్యద్‌పీర్ (ఫైల్)
నందలూరు/కడప కోటిరెడ్డి సర్కిల్: నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె గ్రామంలోని జెండామానువీధికి చెందిన సయ్యద్ పీర్ (41) కువైట్‌లో హత్యకు గురైనట్లు సమాచారం. మృతుడి బంధువులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సయ్యద్‌పీర్ తమ గ్రామమైన నాగిరెడ్డిపల్లెలోనే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో పదో తరగతి వరకు చదివాడు. తన తండ్రి మరణానంతరం వారు కడపలో నివాసం ఉంటున్నారు. సయ్యద్‌పీర్ కువైట్‌లోని విమానాశ్రయంలో పని చేస్తున్నాడు. అక్కడ కేరళ, రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు మిత్రులతో ఒక గదిలో నివాసం ఉంటున్నాడు. సోమవారం మృతుని మిత్రులు కువైట్‌లోని అంబులెన్స్‌కు ఫోన్ చేసి తమ స్నేహితుడు గుండెపోటుకు గురయ్యాడని సమాచారం ఇచ్చారు.
వెంటనే అక్కడికి చేరుకున్న అంబులెన్స్ వారు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సయ్యద్‌పీర్‌ను పరిశీలించారు. అతనిపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అనుమానం పడిన అంబులెన్స్ సిబ్బంది మృతుని మిత్రులను కూడా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చేరిన అనంతరం సయ్యద్‌పీర్ మృతి చెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా.. గాయాల వల్లే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో అక్కడి పోలీసులు అతని మిత్రులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. సయ్యద్‌పీర్‌ను మిత్రులే హత్య చేశారా? లేక ఇతరులు ఎవరైనా చంపారా, చంపేంత అవసరం ఏమొచ్చింది? అనే విషయం అక్కడి పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చుకునేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment