అమెరికాలో ఎన్నారై వైద్యుడు, ప్రముఖ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ రాహుల్ జిందాల్ ప్రతిష్టాత్మక 'అవుట్ స్టాండింగ్ అమెరికన్ బై ఛాయస్' పురస్కారానికి ఎంపికయ్యారు. యూఎస్లో వైద్య రంగానికి ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆ అవార్డుకు ఎంపిక చేసినట్లు యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) శనివారం వెల్లడించింది.
యూఎస్లోని భారతీయ సమాజాన్నే కాకుండా అమెరికన్ ప్రజలకు కూడా రాహుల్ అందించిన సేవలు నభూతోనభవిష్యత్తు అని ఆ సంస్థ పేర్కొంది. ఈ నెల 13న వర్జీనియాలోని అర్లింగ్టన్ నేషనల్ సిమెట్రిలో జరిగే కార్యక్రమంలో ఆ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని రాహుల్ కు అందజేస్తామని వివరించింది.
ఇటీవలే ఇంటర్నేషనల్ లీడర్ షిప్ ఫౌండేషన్ నుంచి రాహుల్ జిందాల్ లీడర్షిప్ అవార్డుకు కూడా అందుకున్నారు. సర్వీస్ అండ్ వాలంటరీజమ్ కమిషనర్గా రాహుల్ జిందాల్ ను ఆ ఫౌండేషన్ నియమించిన సంగతి తెలిసిందే. వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ మెడికల్ సెంటర్లో ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే జార్జీయా వాషింగ్టన్ యూనివర్శిటీలో క్లీనికల్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు.
అహ్మదాబాద్లోని బీజే మెడికల్ కాలేజీలో ఎండీ విద్యను రాహుల్ జిందాల్ అభ్యసించారు. అనంతరం ఉన్నత విద్య కోసం బ్రిటన్ వెళ్లారు. ఆ క్రమంలో అమెరికాలో స్థిరపడ్డారు. సమాజసేవలో భాగంగా ఉత్తర అమెరికాలో దాదాపు 600 దేవాలయాల నిర్మాణంలో పాలుపంచుకున్నారు.