భారత సంతతి వైద్యుడికి ‘నైట్‌హుడ్’
లండన్: లండన్‌లోని భారత సంతతికి చెందిన హర్పాల్ సింగ్ కుమార్ అనే కేన్సర్ వ్యాధి నిపుణుడికి అరుదైన గౌరవం లభించింది. కేన్సర్ వ్యాధి చికిత్స, నివారణలో ఆయన చేసిన సేవలకు గాను ఎలిజబెత్ రాణి అందించే ప్రతిష్టాత్మకమైన ‘నైట్‌హుడ్’ (సర్ బిరుదు) వరించనుంది. ఏటా ప్రముఖ వ్యక్తులకు అందజేసే ‘నైట్‌హుడ్’ జాబితా గురువారం విడుదలైంది. ప్రస్తుతం ఆయన లండన్‌లోని కేన్సర్ రీసెర్చ్ యూకే సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా సేవలందిస్తున్నారు.
కాగా, ఫండింగ్ సర్కిల్ కంపెనీ సీఈవో సమీర్ దేశాయ్‌కి ఆర్థిక రంగంలో చేసిన కృషికి గాను ‘కమాండర్ ఆఫ్ మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్’ (సీబీఈ) బిరుదు ఇవ్వనున్నారు. ఆఫీసర్ ఆఫ్ మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ జాబితాలో కిడ్డికేర్ లిమిటెడ్ నర్సరీస్ మేనేజింగ్ డెరైక్టర్ కలా పటేల్ పేరు కూడా ఉంది. బ్రిటిష్ ఎంపైర్ పతకాన్ని అశోక్ అనద్‌కట్, ఆటిన్ అశోక్‌లకు ఇవ్వనున్నారు.