లండన్ :
తారా(తెలుగు అసోసియేషన్ ఆఫ్ రెడింగ్ అండ్ అరౌండ్ యూకే) ఆధ్వర్యంలో శ్రీ హేవిళంబి ఉగాది 2017 ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సుమారు 600 మంది తెలుగువారు ఈ ఉత్సవాలకు హాజరై "ఏదేశమేగినా ఎందు కాలిడినా" అన్న రాయప్రోలు మాటలను నిజం చేశారు. ఈ ఉగాది ఉత్సవాలలో పద్మశ్రీ అవార్డు గ్రహీత 'లక్ష్మి ఆసు' యంత్ర నిర్మాత చింతకింది మల్లేశం ముఖ్య అతిథిగా విచ్చేశారు.
తారా అధ్యక్షులు సూర్యప్రకాష్ భళ్లమూడి, మల్లేశంని సగౌరవంగా ఆహ్వానిస్తూ వేదికపైకి తీసుకొని వచ్చారు. తారా కార్యదర్శి సంతోష్ బచ్చు మల్లేశంని రెడింగ్ తెలుగువారికి పరిచయం చేస్తూ, వారు పడ్డ శ్రమను,నిస్వార్ధంగా వారు చేస్తున్న పనిని కొనియాడారు. 'తారా' కోశాధికారి రవికాంత్ వాకాడ మాట్లాడుతూ మల్లేశం అందరికి రోల్ మోడల్ అని, కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అన్న మాటకి ప్రత్యక్ష ఉదాహరణ అని ప్రశంసించారు.
'తారా' వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మి మాటూరు, మహిళా కార్యదర్శి మధురిమ రంగాలు మల్లేశంకు పుష్పగుఛ్చం అందించగా, సూర్యప్రకాష్, సంతోష్ శాలువాతో సత్కరించారు. రవికాంత్, బాలా కాకర్ల తారా మొమెంటోను అందజేశారు. ఈ సందర్భంగా తారా తొలిసారిగా ప్రచురించిన తెలుగు క్యాలెండర్ను తారా ట్రస్టీలు నవీన్ గుర్రం, గోపికిషన్ నేరెళ్లకుంట, రాంబాబు బూరుగులు మల్లేశంతో ఆవిష్కరింపజేశారు. తారా తెలుగు పత్రిక 'తోరణం' మొదటి సంచికను 'తారా' ట్రస్టీలు వెంకట్ పారాగారు మల్లేశంకి అందజేశారు.
అనంతరం మల్లేశం మాట్లాడుతూ 'తారా' యు.కె. తెలుగు ప్రజలకి చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ, తమ అనుభవాలని సోదాహరణంగా ఫొటోలు, వీడియోల సహాయంతో వివరించారు. 'లక్ష్మి ఆశు' యంత్ర నిర్మాణంలో వారు పడ్డ కష్టాలను, వారి తల్లిపడిన కష్టం, చేనేత కార్మికులకు ఈ యంత్రం ఏ విధంగా ఉపయోగ పడుతోందో తెలిపారు. మల్లేశం తల్లిపడిన కష్టాన్ని చెప్తున్నప్పుడు హాజరైన అందరూ చలించిపోయారు. ఉపన్యాసం ముగిసినప్పుడు సభా ప్రాంగణంలో హర్షధ్వానాలు వెల్లువెత్తాయి.కార్యక్రమానికి హాజరైన తెలంగాణా ప్రవాస సంఘం (టీఈఎన్ఎఫ్) యు.కె. అధ్యక్షులు చంద్రశేఖర్, తారా చేస్తున్న సేవలను కొనియాడుతూ వారి సంఘం చేనేత కార్మికులకు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. మల్లేశం భావి తరాలకు మార్గదర్శకం అని కొనియాడారు.
సింగర్ హేమచంద్ర వేదుల, దామిని భట్లలు బాహుబలి చిత్రంలో పచ్చబొట్టు పాటతో వీక్షకులను ఉర్రూతలూగించారు. తారా సభ్యులు ప్రదర్శించిన అనేక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి. చిన్న పిల్లల నాటకాలు, నృత్యాలు, పాటలు సభికులను ఎంతాగానో ఆకట్టుకున్నాయి. చివరిగా ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి తోడ్పడిన వాలంటీర్ల సేవలను సంతోష్, రవికాంత్ పేరు పేరున స్మరించి వారికి తారా తరపున ధన్యవాదాలు తెలియజేశారు.
యూకేలో ఘనంగా 'తారా' ఉగాది ఉత్సవాలు
Published Thu, Apr 6 2017 4:30 PM | Last Updated on Tue, Sep 5 2017 8:07 AM
Advertisement
Advertisement