మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగతనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.
-45 రోజుల్లో 15 ఇళ్లల్లో దొంగతనాలు
-ఇద్దరు పోలీసుల ఇళ్లలోనూ చోరీలకు తెగబడ్డ దుండగులు
బోడుప్పల్
మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగతనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాళాలు వేసిన ఇళ్లను ఎంచుకుని దొంగతనాలకు పాల్పడుతున్నది ఒక ముఠానా లేక వేర్వేరు వ్యక్తులు చేస్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. గడిచిన 50 రోజుల్లో 15 ఇళ్లలో చోరీలు జరిగాయి. ఇళ్ల తాళాలు పగుల కొట్టి సుమారు రూ. 13 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఒక దోపిడీ సైతం జరిగింది. దాతల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి బోడుప్పల్, చెంగిచర్లలో సీసీ కెమోరాలు ఏర్పాటు కేవలం అలంకార ప్రాయంగా మారింది. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడంలోను, దొంగలను పట్టుకోవడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 50 రోజుల్లో 15 దొంగతనాలు జరిగినా ఒక్క దొంగను కూడా పట్టుకోవడంలో పోలీసులు సఫలీకృతం కాలేకపోయారు. దీంతో ఉద్యోగస్తులు, ఊరికి వెళ్లే వారు తమ ఇళ్లకు తాళాలు వేసి వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారు. ఇద్దరు పోలీసుల ఇళ్లలో దొంగతనానికి తెగబడి చోరులు పోలీసులకు పరోక్షంగా సవాల్ విసిరారనే చెప్పొచ్చు.
జరిగిన చోరీలు ఇవీ...
బోడుప్పల్ సరస్వతి కాలనీలో బాలమణి తన చిన్న కుమారుడుతో నివాసం ఉంటుంది. జూలై 6వన తన కుమారుడు దైవ దర్శనానికి వెళ్లగా రాత్రిపూట బాలమణిని నోటికి ప్లాస్టర్ వేసి కిచెన్ బంధించి ఆగంతకులు రూ. 37,50,000 (బంగారం వస్తువుల, నగదు) దోచుకెళ్లారు.
చెంగిచర్ల ఎంఎల్‌ఆర్ కాలనీలో నివసించే యాస శ్రీకాంత్‌రెడ్డి జూలై 1న నల్లగొండ జిల్లా తుర్కపల్లి గ్రామంలో తాతయ్యకు అనారోగ్యం ఉండటంతో కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లారు. తెల్లవారి వచ్చే సరికి ఇంట్లో ఉన్న 13 తులాలు బంగారం, 30 తులాలు వెండి కనిపించలేదు.
చెంగిచర్ల క్రాంతి కాలనీలో నివసించే కృష్ణకుమార్ హైటెక్ సిటీలో సాప్ట్‌వేర్ ఉద్యోగి. కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లారు. మరుసటి రోజు ఇంటికి రాగా తాళాలు పగులకొట్టి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూసుకోగా 4 తులాల బంగారం, 30 తులాల వెండి కనిపించలేదు.
సాయిభవానీనగర్‌లో నివసించే పోలిశెట్టి రాజేందర్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో ఎస్‌ఐ. (ఆర్‌పీఎఫ్) ఈ నెల 13న కుటుంబ సభ్యులతో కలిసి నిజామాబాద్‌లో శుభకార్యానికి వెళ్లారు. 14న ఇంటికి వచ్చి చూసుకోగా 7 తులాల బంగారం, రూ. 28 వేలు కనిపించలేదు.
బోడుప్పల్ పద్మావతి కాలనీలో నివసించే కొంగర శ్రీనివాస్ బ్లడ్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తారు. ఈ నెల 18న అశోక్‌నగర్‌లో రాఖీ కట్టడానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. ఇంటికి వచ్చి చూసుకోగా ఇంట్లోని బీరువాలో ఉంచిన 7 తులాల బంగారం, రూ. 28 వేలు, రెండున్నర తులాల వెండి మాయమైంది.