
ఎత్తిపోతల పథకాలకు మహర్దశ
► 18 పథకాల పునరుద్ధరణకు ప్రతిపాదనలు పంపిన ఏపీఎస్‌ఐడీసీ
► 16 స్కీమ్‌లకు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం
కర్నూలు సిటీ: నేలపై పడిన ప్రతి వర్షపు బొట్టును ఒడిసి పట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నీరు-ప్రగతి కార్యక్రమం కింద డబుల్ డిజిట్ గ్రోత్ కింద జిల్లాలో గతంలో ప్రారంభించి మరమ్మతులకు నోచుకోని ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణపై దృష్టి పెట్టింది. ఈ స్కీమ్‌లని పునరుద్ధరిస్తే 8322 ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా జిల్లాలో మొత్తం 18 పథకాలను పునరుద్ధరించేందుకు 20.32 కోట్లకు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఐడీసీ) అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. ఈమేరకు ఇటీవలే 16 పథకాలకు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
జిల్లాలో మొత్తం 77 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటితో పాటు మరో 23 పథకాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ నాటికి ఈ పనులు పూర్తి చేసి ఆయకట్టును రెండింతలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ఏడాది 90 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని 2016-17 సంవత్సర ప్రణాళికలో లక్ష్యంగా పెట్టుకున్నారు.
పునరుద్ధరణతో అదనపు ఆయకట్టు
జిల్లాలో చిన్న చిన్న కారణాలతో పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరు అందించలేకుండా ఉన్న 18 స్కీమ్‌లను పునరుద్ధరించేందుకు ప్రభుత్వానికి 20.32 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. వీటిలో 16 ఎత్తిపోతల పథకాలకు ఇటీవలే నిధులు మంజూరు అయ్యాయి. మిగిలిన రెండు స్కీమ్‌లకు కూడా త్వరలోనే నిధులు మంజూరు అయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత టెండర్లు పిలిచి పనులు మొదలు పెడతాం.- రెడ్డిశంకర్, ఈఈ, ఏపీఎస్‌ఐడీసీ