20 టన్నుల, రేషన్, పట్టివేత
20 టన్నుల, రేషన్, పట్టివేత
Published Fri, Jan 20 2017 9:13 PM | Last Updated on Tue, Sep 5 2017 1:42 AM
దుర్గి : రేషన్ మాఫియా ఆగడాలకు అవధులు లేకుండా పోయాయి. విజిలెన్స్, పోలీసు అధికారులు పలుమార్లు అక్రమంగా రవాణా చేస్తున్న బియ్యం వాహనాలను పట్టుకున్నా అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తాజాగా శుక్రవారం తెల్లవారుజామున విజిలెన్స్ అధికారులు, పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో భారీగా బియ్యాన్ని పట్టుకున్నారు. మండలంలోని అడిగొప్పల, దుర్గి, మాచర్ల పరిసర ప్రాంతాల నుంచి మహిళల ద్వారా రేషన్ మాఫియా ఇంటింటికి తిరిగి సేకరించిన రేషన్ బియ్యాన్ని మినీట్రక్కులతో తరలించి టర్బో లారీలలో నింపి వినుకొండకు తరలించి అమ్మి బియ్యాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. రేషన్ అక్రమ బియ్యాన్ని అరికట్టాలని ప్రజాప్రతినిధులు మీటింగ్‌లలో చెప్పటం తప్పా చేసిందేమీ లేదు. శుక్రవారం లారీలను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ డిఎస్పీ వీవీబీ రమణకుమార్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలోని గ్రామాలలో సేకరించిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారం అందిందన్నారు. దుర్గి పోలీసుల సహకారంతో అడిగొప్పల కుడికాలువ వద్ద టర్బో లారీ, మినిట్రక్కులలో ఉన్న 300 బస్తాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విజిలెన్స్ అధికారులు టి.వెంకటేశ్వర్లు, ఎస్సై ఎన్.శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు, కానిస్టేబుల్స్ నాంచారయ్య, భూపతి, శివకృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తహశీల్దార్ ఏసుబాబు, అడిగొప్పల వీఆర్వో యలమంద, ఎస్సై సుబ్బానాయుడులతో పంచనామా నిర్వహించి మాచర్లకు తరలిస్తామని తెలిపారు. లారీ డ్రైవర్లు వడితె రాజు, దువ్వూరి విశ్వరూపాచారీలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దుర్గి పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఎవరికైనా రేషన్ అక్రమ తరలింపు గురించి సమాచారం తెలిస్తే 8008203289, 8008203288లకు సమాచారం అందించాలన్నారు.
Advertisement