బ్యాంకులో 329 కాసుల బంగారం మాయం
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులోని కార్పొరేషన్ బ్యాంక్ బ్రాంచిలో ఖాతాదారులు తాకట్టు పెట్టిన 329 కాసుల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. రూ.70 లక్షల విలువైన నగలను ఇంటిదొంగలే కాజేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖాతాదారులు పెద్దఎత్తున బ్యాంక్‌కు చేరుకుని తమ నగలు ఏమయ్యాయో చెప్పాలని నిలదీశారు.
కార్పొరేషన్ బ్యాంకులో బంగారు ఆభరణాల మాయం వ్యవహారం సంచలనం సృష్టించింది. స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచిన సుమారు 329 కాసుల ఆభరణాలున్న సంచులు మాయం కావడంతో అందరిలోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకు సిబ్బంది పనే అయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ దిశగా పోలీసులూ దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల కథనం ప్రకారం.. తనఖా పెట్టిన బంగారు ఆభరణాలను విడిపించుకునేందుకు శనివారం స్థానిక రైస్‌మిల్లర్ చుండూరి వెంకట సత్యనారాయణ బ్యాంకుకు వచ్చారు. ఆ సమయంలో నగల కోసం బ్యాంకు స్ట్రాంగ్‌లోకి వెళ్లిన సిబ్బందికి సత్యనారాయణ ఆభరణాలు కనిపించలేదు. దీంతో విషయాన్ని బ్యాంకు మేనేజర్ ఎం.ఎన్.వి.ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన సోమవారం రావాలని సత్యనారాయణకు సూచించారు. ఆ తర్వాత బ్యాంకు స్ట్రాంగ్ రూంను పరిశీలించారు.
మొత్తం 1433 మంది తనఖా పెట్టిన సుమారు 329 కాసుల బంగారు ఆభరణాలు ఉన్న 19 సంచులు మాయమైనట్టు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.70లక్షలు ఉంటుందని సమాచారం. ఈ విషయం బయటకు పొక్కడంతో రుణగ్రస్తులు భారీగా సోమవారం బ్యాంకు వద్దకు చేరుకున్నారు. తమ ఆభరణాల గురించి వాకబు చేశారు. ఆభరణాల మాయంపై బ్యాంకు డిప్యూటీ జోనల్ మేనేజర్ వారణాసి బాలాజీరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్‌ఐ అశోక్‌కుమార్ బ్యాంకు వద్దకు చేరుకున్నారు. ఆభరణాల మాయంపై ఆరా తీశారు. బ్యాంకు మేనేజర్ ప్రసాద్‌తోపాటు మరో నలుగురు సిబ్బందిని, అప్రైజర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఆభరణాలు కనబడని ఖాతాల జాబితాను బ్యాంకు వద్ద ప్రదర్శించారు. రుణగ్రస్తులు ఆ జాబితాలు చూసుకున్నారు. బ్యాంకు సిబ్బందే తమ ఆభరణాలను మాయం చేసి ఉంటారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఎస్‌ఐ రుణగ్రస్తులతో మాట్లాడారు. సమగ్ర దర్యాప్తు జరిపి రుణగ్రస్తులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.