మాట్లాడుతున్న కలెక్టర్ లోకేష్‌కుమార్
- కలెక్టర్ లోకేష్‌కుమార్
ఖమ్మం జెడ్పీసెంటర్: హరితహారం కింద 2017–18 సంవత్సరానికి జిల్లాలో 4.04 కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యానికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు కలెక్టర్ లోకేష్‌కుమార్ తెలిపారు. హరితహరంలో జిల్లాలో నాటిన మొక్కలు, వాటి సంరక్షణ చర్యలు, వచ్చే ఏడాది లక్ష్య సాధన, మరుగుదొడ్లు నిర్మాణం, పొగరహిత గ్రామాలు తదితరాంశాలపై ఆయన శుక్రవారం జాయింట్ కలెక్టర్ దివ్యతో కలిసి ఎంపీడీఓలు, తహసీల్దారులతో కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది 3.77 కోట్ల మొక్కలు నాటామన్నారు. వచ్చే ఏడాది 4.04 కోట్ల మొక్కలు నాటాలన్నది లక్ష్యమని అన్నారు. 4.95 కోట్ల మొక్కలను వివిధ శాఖల నర్సరీల ద్వారా పెంచేందుకు లక్ష్యాలను నిర్దేశించినట్టు చెప్పారు. ఇప్పటివరకు నాటిన మొక్కల వివరాలను గ్రామ పంచాయతీలవారీగా గ్రామ స్థాయిలో రిజిస్టర్ నిర్వహించాలన్నారు. గ్రామస్థాయి బాధ్యునితోపాటు మండలాధికారులు వారానికి రెండుసార్లు తప్పనిసరిగా పర్యటించి మొక్కలను పరిశీలించాలని ఆదేశించారు. జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యంలో 70 శాతం పూర్తి చేశామన్నారు. మిగిలినవి త్వరగా పూర్తిచేయాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణ పురోగతిపై ప్రతి గురువారం తహసీల్దారులు, ఎంపీడీఓలు గ్రామాలమ సందర్శించాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ దివ్య మాట్లాడుతూ.. దీపం పథకం కింద రెండువేల రూపాయపలకే గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నట్టు చెప్పారు. ఇంతకు మించి వసూలు చేసిన గ్యాస్ ఏజెన్సీలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ మారుపాక నాగేశ్, ఆర్డీఓలు వినయ్‌కృష్ణారెడ్డి, రవీంద్రనా«ద్ తదితరులు పాల్గొన్నారు.