మేలో 97 లక్షల శ్రీవారి లడ్డూల అమ్మకాలు
సాక్షి, తిరుమల: వేసవి సెలవుల్లో పెరిగిన భక్తులకు అనుగుణంగా మే నెలలో రికార్డు స్థాయిలో 97.27 లక్షల తిరుమల శ్రీవారి లడ్డూల అమ్మకాలు జరిగాయి. టీటీడీ చరిత్రలో ఒక నెలలో ఇన్ని లడ్డూలను భక్తులకు వితరణ చేయటం ఇదే తొలిసారి. 2013 లో మేలో 72.33 లక్షలు, 2014లో 80.84 లక్షలు, 2015లో 89.84 లక్షలు అందజేయగా ఈసారి మాత్రం 97.24 లక్షలు పంపిణీ చేశారు. టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు పర్యవేక్షణలో రోజుకు 6 లక్షల లడ్డూలకు తగ్గకుండా నిల్వ ఉంచుకుని కొరత లేకుండా పంపిణీ చేశారు.
తగ్గని రద్దీ: తిరుమలలో వేసవి సెలవుల రద్దీ ఆదివారం కూడా కొనసాగింది. శనివారం కాలిబాట భక్తుల క్యూలో జరిగిన తోపులాటలపై టీటీడీ ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలిబాట భక్తుల క్యూ వద్ద లగేజీ డిపాజిట్ చేసుకునేందుకు వీలుగా వసతులు కల్పించారు. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 67,113 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లు నిండాయి. వీరికి 15 గంటలు, కాలిబాట భక్తులకు 8 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించనుంది.